సారవకోట: అన్నుపురం గ్రామానికి చెందిన తాడేల శ్రీరాములు (85) తీర్థయాత్రలకు వెళ్లి గురువారం రాత్రి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. 15 రోజుల క్రితం గ్రామానికి చెందిన పలువురితో కలిసి శ్రీరాములు బస్సులో తీర్ధయాత్రలకు బయల్దేరాడు. గురువారం రాత్రి బద్రీనాథ్‌లో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో తోటి ప్రయాణికులు సపర్యలు చేశారు. అనంతరం కాసేపటకి ఆయన మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి వివాహితులైన నలుగురు కుమారుల, ఇద్దరు కుమార్తెలున్నారు. మృతదేహాన్ని స్వగ్రామం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
రణస్థలం : జె.ఆర్.పురం పంచాయతీకి చెందిన కొయ్యాన తనీష్, తలే రాకేష్‌లు ద్విచక్రవాహనంపై విశాఖ వైపు నుంచి రణస్థలం వైపు వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున కోష్ట ఫ్‌లై ఓవర్‌పై అదుపు తప్పిపడిపోయారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో తొలుత శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి ఒకరిని శ్రీకాకుళం, మరొకరికి విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనివాసరావు నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని మొండేటి వీధికి చెందిన లంకపల్లి శ్రీనివాసరావు (58) మృతి చెందడంతో ఆయన నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మృతుడి భార్య నాగమణి, ఎల్.చలపతిరావులు నేత్రదానానికి అంగీకరించి రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావుకు తెలియచేశారు. నేత్రదాన మోటివేటర్ డి.వలసయ్య సమన్వయంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు పూతి సుజాత, పి.చిన్ని కృష్ణలు శ్రీనివాసరావు కార్నియాలను సేకరించి వాటిని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. ఎవరైనా నేత్రదానం చేయాలనుకుంటే 78426 99321 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.


