వ్యర్థ రహిత పాఠశాలలుగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

వ్యర్థ రహిత పాఠశాలలుగా తీర్చిదిద్దాలి

Jun 6 2026 12:47 AM | Updated on Jun 6 2026 12:47 AM

శ్రీకాకుళం రూరల్‌: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలోని విద్యాసంస్థలను నెట్‌ జీరో (కార్బన్‌ ఉద్గారాల రహిత) పాఠశాలలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు. పెదపాడు పంచాయతీ శాస్త్రులపేటలో మహాత్మాజ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నెట్‌ జీరో సాధన దిశగా అన్ని పాఠశాల్లో విద్యుత్‌ వినియోగాన్ని క్రమబద్ధీకరించాలని, ఎలాంటి చెత్త వ్యర్థాలు చేరకూడదని స్పష్టం చేశారు. తడిపొడి వ్యర్థాలను వేరుచేసి సేంద్రియ ఎరువుల తయారీ, ఇంకుడు గుంతలు నిర్మాణం, హరిత ఇందనం వినియోగం వంటి పద్ధతులను అవలంబించుకోవాలన్నారు. ప్రధానంగా ప్లాస్టిక్‌ వాడకం, గ్యాస్‌ ఉద్గారాల వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలగడమే కాకుండా కార్బన్‌ డయాకై ్సడ్‌ విడుదలై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు. గురుకుల పాఠశాలలను నెట్‌ జీరోగా మారిస్తే అదనపు వనరులను కల్పిస్తామన్నారు. పాఠశాల్లో మైనర్‌ మరమ్మతుల కోసం రూ.70 లక్షలు మంజూరు చేశామన్నారు. అసంపూర్తిగా ఉన్న 500 మీటర్లు కాంపౌడ్‌ వాల్‌, స్కూల్‌ అప్రోచ్‌ రోడ్డు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బీసీ సంక్షేమ అధికారి అనురాధ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నెట్‌జీరో భావనను జిల్లాలోని ఎంపీజే గురుకులాల్లో అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా అటవీశాఖాధికారి జ్ఞాన ప్రసూన, పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.జయశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement