శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు గొప్ప విజయంగా అభివర్ణించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ కళింగ వైశ్య బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు అంధవరపు సూరిబాబు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ పాలనపై బోయిన గోవిందరాజులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. గ్రామ స్వరాజ్యం వల్లే రామరాజ్యం ఏర్పడుతుందన్న మహాత్ముడి కలలను నిజం చేసిన గొప్ప పరిపాలనాదక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని స్పష్టం చేశారు. సుమారు లక్షా నలభై వేల మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని, దేశంలోనే అత్యుత్తమ సీఎంగా అనేక మంది జాతీయ స్థాయి ప్రముఖులు గుర్తించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దళారీ వ్యవస్థను రూపుమాపి ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలను అందించారని గుర్తు చేశారు. జగన్‌ను విమర్శించే స్థాయి గోవిందరాజులుకు లేదన్నారు. 56 మందిని కుల కార్పొరేషన్ చైర్మన్లుగా, 672 మందిని డైరెక్టర్లుగా నియమించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఇప్పటికై నా గోవిందరాజులు కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవిని కుల శ్రేయస్సుకు వినియోగించి సేవ చేయాలని హితవు పలికారు. ఈ పదవితో పాటు రాష్ట్ర కళింగ వైశ్య సంక్షేమ సంఘ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి అర్హత గల వేరొక అనుభవశాలికి ఇచ్చి కుల అభ్యున్నతికి దోహదపడాలని కోరారు.


