నాణ్యమైన మొక్కలతో దిగుబడులు
యాజమాన్య పద్ధతులు పాటించాలి
● ఉద్యాన పంటలపై ప్రభుత్వానికి ఉదాసీనత ● పెద్దపేట పరిశోధన కేంద్రానికి నిధులు మంజూరు చేయని వైనం ● అవస్థలు పడుతున్న శాస్త్రవేత్తలు
బూర్జ: కొబ్బరి, మామిడి, జీడి వంటి పంటల మీద పరిశోధనలు చేసి.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనువైన కొత్త వంగడాల అభివృద్ధి, ఉద్యాన రంగానికి సంబంధించి రైతులకు శిక్షణలు ద్వారా అవగాహన కల్పించేందుకు మండలంలోని పెద్దపేటలో ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని 2022 ఆగస్టు 29వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మొత్తం 77 ఎకరాలకు గా నూ సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో మేలైన కొబ్బరి, మామిడి, జీడి పంటలు తీసుకొచ్చేందుకు పరిశోధనలు చేయాలనేది ఉద్దేశం. దీనిలో భాగంగా ప్రస్తుతం 2 ఎకరాల్లో 160 కొబ్బరి మొక్కలపై పరిశోధనలు చేస్తున్నారు. కొత్త మొక్కలు రైతులకు అందజేయడం కోసం నర్సరీ తయారు చేశారు. నర్సరీలో మన ప్రాంతాలకు అనువైన రకాలు అభివృద్ధి చేసి రైతులకు సరఫరా చేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలుపుతున్నారు. అయితే మరింత అభివృద్ధి కోసం సుమారు రూ.20 లక్షలు మంజూరు కోసం ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం మూడు జిల్లాల రైతుల ప్రయోజనం కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, ఈస్ట్ కోస్టల్ టాల్ అనే రకం అభివృద్ధి చేసి రైతులకు అందజేయడం జరుగుతోంది. కొబ్బరి మొక్క రూ.100కు అందజేస్తున్నాం. నాణ్యమైన మొక్కల వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు.
– జి.నరసింహమూర్తి, ప్రధాన శాస్త్రవేత్త, పెద్దపేట ఉద్యాన పరిశోధన కేంద్రం
కొబ్బరి మొక్కలకు వర్షాలు బాగాపడి, గాలులు వీచినప్పుడు మొవ్వుకు కుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొబ్బరిలో కొమ్ము పురుగు ఆశించినప్పుడు మొవ్వు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అందువలన రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి. జీడి, మామిడి పంట కోసే సమయంలో రైతులు చెట్ల మొదళ్లను గమనించాలి. తెగుళ్ల బారిన పడినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి.
– టి.రాజశేఖరం, తెగుళ్ల విభాగం సీనియర్ శాస్త్రవేత్త, పెద్దపేట ఉద్యాన పరిశోధన కేంద్రం


