నేటి నుంచే సర్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచే సర్‌

Jun 5 2026 12:54 AM | Updated on Jun 5 2026 12:54 AM

నేటి నుంచే సర్‌

7 నుంచి 14 వరకు ప్రత్యేక ఓటరు మ్యాపింగ్‌

15 నుంచి బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే

మ్యాపింగ్‌ కాకపోతే ఓటు కోల్పోయే అవకాశం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల తయారీకి సంబంధించి భారత ఎన్నిక ల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ ప్రక్రియ ఈ నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ 5 నుంచి 11 వరకు ‘సర్‌’ నిర్వహణపై సంబంధిత అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తారు. 15 నుంచి బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తారు. ఓటర్ల జాబితా ప్రకారం ప్రస్తుతం అక్కడ ఓటర్లు ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తారు. లేని ఓటర్లను తొలగింపు జాబితాలో చేర్చుతారు. అక్కడ ఓటు ఉంటే అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. ఒకే కుటుంబంలో ఉన్న వారి ఓట్లు ఒకే చోట ఉండేలా మ్యాపింగ్‌ చేస్తారు.

మ్యాపింగ్‌ కాకపోతే..

ఓటరుగా మ్యాపింగ్‌ కాకపోతే ఇబ్బంది తప్పుదు. జిల్లాలోని ఎనిమిది నియోజవర్గాల పరిధిలో ప్రస్తు తం 18,91,782 మంది ఓటర్లు ఉన్నారు. ఎందులో ఇప్పటి వరకు కేవలం 65 శాతం మంది ఓటర్లకు మాత్రమే మ్యాపింగ్‌ జరిగింది. ఇంకా 35 శాతం మంది ఓటర్లను మ్యాపింగ్‌ చేయాల్సి ఉంది. మ్యా పింగ్‌ కోసం ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తారు. మ్యాపింగ్‌ కాని వారు ఈ ప్రత్యే క డ్రైవ్‌లో మ్యాపింగ్‌ చేయించుకోవాలి. లేదంటే ఓటు పోయే ప్రమాదం ఉంది. ప్రధానంగా ఉద్యో గులు, స్థానికంగా ఉండని వారు, బీఎల్‌ఓలు వచ్చే సమయంలోనూ, ఈ మ్యాపింగ్‌ డ్రైవ్‌ సమయంలో లేని వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

బీఎల్‌ఓలే కీలకం

‘సర్‌’ విషయంలో బీఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండాలి. వీరికి రాజకీయ పార్టీలు నిజాయితీగా సహకరించాల్సి ఉంటుంది. ప్రతి ఓటరు మ్యాపింగ్‌ కావాలి. అందుకు కావాల్సిన డాక్యుమెంట్లు సరిచేసుకోవాలి. బీఎల్‌ఓలు ఇంటికి వచ్చినప్పుడు వారికి అందించాలి. ఓటరు స్థానికంగా లేనప్పుడు బంధువులు వారి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. పొరపాటున ఓటు తొలగిస్తే.. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు ఓటరుగా నమోదుకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఓటరు జాబితాలో తప్పులు ఉండకూడదు

తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ రాజకీయ కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)–2026 (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–2026) ప్రక్రియపై జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలసి గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. సర్‌ ప్రక్రియకు సన్నద్ధత, అధికారులు, సిబ్బందికి శిక్షణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు, ఎన్యూమరేషన్‌ ఫారాల (ఈఎఫ్‌) జనరేషనన్‌, ప్రింటింగ్‌, ఈఎఫ్‌ల అందజేత, బీఎల్‌ఓ కిట్లు, తదితరాల గురించి వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి జూన్‌ 5 నుంచి 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు జరుగుతాయని, ఆపై జూన్‌ 15 నుంచి జులై 14 వరకు బీఎల్‌ఓల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుందని వివరించారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ల స్వీకరణ ఉంటుందని, ఆ తర్వాత వీటిని పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్‌ 22న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని వివరించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం గరిష్టంగా 1200 మంది ఓటర్లకు మాత్రమే పరిమితం కావాలని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ జరగాలన్నారు. సర్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందన్నారు.

సమావేశంలో వైఎస్సార్‌సీపీ నుంచి డి.మన్మధరావు, టీడీపీ నుంచి మొదలవలస రమేష్‌, పీఎంజేబాబు, బీజేపీ నుంచి బీఎల్‌ సింగ్‌, ఐటీ కుమార్‌, కాంగ్రెస్‌ నుంచి ఎస్‌.అన్నాజిరావు, కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement