● నేడూ, రేపూ మండల కేంద్రాల్లో కూటమి మేనిఫెస్టో, సంతకాల బాండ్లు దహనం
● విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు కృష్ణదాస్ పిలుపు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
వెన్నుపోటుకు రెండేళ్లు.. ఇప్పుడు రాష్ట్రమంతా వినిపిస్తున్న మాట. మామను వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారని సాక్షాత్తు దివంగత ఎన్టీ ఆరే ఆనాడు చెప్పారు. ఎన్నుకున్న ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ఆయన చేసేది ఇదే. ప్రతిపక్షంలో ఉండగా హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక గాలికొదిలేయడం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు అధికారంలోకి కూడా వచ్చాక ఎడాపెడా హామీలు ఇవ్వడం.. అక్కడి నుంచి వెళ్లిపోయాక పట్టించుకోకపోవడం అలవాటుగా మారిపోయింది. ఇప్పుడా వెన్నుపోటు పాలనను ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమైంది. నేటి నుంచి వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.
అంతా అరాచకమే..
‘ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఉంది సీఎం చంద్రబాబు తీరు. హామీల అమలు, కొత్త పథకాలు లేకపోగా ఉన్న వాటిని బొంద పెట్టేశారు. గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను సైతం నీరు గార్చేస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో స్కామ్‌ల పాలన కొనసాగిస్తున్నారు.
హామీల అమలేది?
తాజాగా అధికారంలోకి వచ్చాక జిల్లాలో ఒక్కటంటే ఒక్క కొత్త కార్యక్రమం చేపట్టలేదు. పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఎ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అగ్నిమాపక కేంద్రం, 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు వాటికి అతీగతి లేదు. ఆమదాలవలస నియోజకవర్గంలో పురుషోత్తపురం వద్ద వంశధార నదిపై, ముద్దాడపేట వద్ద నాగావళి నదిపై వంతెనల నిర్మాణాలు పూర్తి చేస్తామని, నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడం లేదు. నియోజకవర్గానికొక ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తామని, వంశధార ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేస్తామని, జీడి పిక్కల 80 కిలోల బస్తాకు మద్దతు ధర రూ.16 వేలు ఇప్పిస్తామని, ఆఫ్‌షోర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, వంశధార కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేస్తామని, పలాసలో రైతు బజారును ఏర్పాటు చేస్తామని, వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేస్తామని, పలాసలో డిఫెన్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, నరసన్నపేట పరిధిలో ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, వంశధార– బాహుదా నదుల అనుసంధానం చేస్తామని, కళింగ వైశ్యులను ఓబీసీలో చేర్చుతామని, టెక్కలిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని, బుడగట్లపాలెంలో మత్స్యకార జెట్టీ నిర్మాణం చేస్తామని ప్రజల్ని ప్రలోభ పెట్టారు. వీటిలో ఒక్కటంటే ఒక్కటీ అమలు కాలేదు.
అధికారంలోకి వచ్చాక..
అధికారంలోకి వచ్చాక జిల్లాలో రెండు సార్లు పర్యటించి పలు హామీలిచ్చారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభోత్సవంలో పలు హామీల గుప్పించి మరిచిపోయారు. ఎంత దారుణమంటే జిల్లాలో ప్రారంభించిన ఉచిత సిలిండర్ల పథకం కింద ఒక సిలిండర్ ఇచ్చి మిగతావి ఇవ్వకుండా మొండి చేయిచూపారు. సినీ సెట్టింగ్‌లు, సినీమాటిక్ ఫోజులకే పర్యటనలు పరిమితమయ్యాయి. ఇటీవల జరిగిన నరసన్నపేట పర్యటన కూడా దాదాపు అంతే. పర్యటనలతో ఖర్చు తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు.
ఇచ్ఛాపురం పర్యటన హామీలివి..
● బాహుదాలో గ్రోయిన్స్ తదితర మరమ్మతు పనులకు, అరకబద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు రూ.30 కోట్లు. బెంతొరియాల పేరుతో స్థానికత ధ్రువపత్రాలు మంజూరు. ఉద్దానంలో కొబ్బరి పార్కు ఏర్పాటు. పేదలకు పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాలు. ఇళ్ల నిర్మాణం. అరసవల్లి సూర్యదేవాలయం అభివృద్ధికి రూ.100 కోట్ల ప్రాజెక్టు.
● పలాస కిడ్నీ కేంద్రానికి రూ.60 కోట్లు.
పై వాటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు.
బుడగట్లపాలెం పర్యటన హామీలివి..
● మత్స్యకార సేవ కార్యక్రమం ప్రారంభోత్సవం చే సేందుకు ఎచ్చెర్లమండలం బుడగట్లపాలెంలో చం ద్రబాబు పర్యటించి పలు హామీలు గుప్పించారు.
● బుడగట్లపాలెంలో 18 మందికి ఇళ్లు.
● పర్యాటకంగా తీరం అభివృద్ధి.
● గ్రామంలో రహదారులు, మరుగుదొడ్లు, డ్రైనేజీలు నిర్మాణం.
● ఎచ్చెర్లలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం.
● బుడగట్లపాలెం పిషింగ్ హర్బర్ నిర్మాణం పూర్తి. మూలపేట పోర్టు పనులు వేగవంతం
● ఇచ్ఛాపురం నుంచి విశాఖ వరకు కోస్టల్ కారిడార్ నిర్మాణం.
● నారాయణపురం ఆనకట్ట, మడ్డువలస స్టేజ్ 2, తోటపల్లి ప్రాజెక్టు పూర్తి.
● కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం నిర్వాసితులకు ధర్మవరంలో పునరావాస కాలనీ పూర్తికి చర్యలు.
పైవాటిలో ఏ ఒక్కటీ అమలుకాలేదు.
ఏళ్ల పాలనలో ప్రజలకు నిత్యం పాట్లు
ఎన్నికల సమయంలో లెక్కలేనన్ని హామీలు
అధికారంలోకి వచ్చాక కూడాచంద్రబాబు వాగ్దానాలు
పబ్లిసిటీ ఖర్చు తప్ప ప్రజలకు మేలు జరగని పరిస్థితి
నాలుగోసారి మోసపోయిన జిల్లా ప్రజలు
నరసన్నపేట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను వంచించిన చంద్రబాబు వైఖరికి నిరసనగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలుగు, ఐదు తేదీల్లో జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూటమి మేనిఫెస్టో, సంతకాల బాండ్లు దహనం చేసే కార్యక్రమాలు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 8, 9 తేదీల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట సదస్సులు నిర్వహించి కూటమి పాలన చేసిన మోసాలు, అరాచకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ నెల 12న చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా జిల్లాలోని 8 నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ పరిశీలకులు, పార్టీ శ్రేణులంతా తప్పక పాల్గొనాలని కోరారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు అంధవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
వెన్నుపోటు పాలన పోస్టర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం రూరల్: సీఎం చంద్రబాబు రెండేళ్లపాటు వెన్నుపోటు పాలన సాగించారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దుయ్యబట్టారు. ఈ మేరకు బుధవారం పెద్దపాడు క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం సర్ ప్రోగ్రాంకు సంబంధించి బూత్‌లెవల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ బూత్‌లకు సంబంధించిన వివరాలను పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పట్టణ వైఎస్సార్‌సీపీ నాయకులు గేదెల పురుషోత్తం, సాధు వైకుంఠరావు, ఎం.తాతబాబు, మండవల్లి రవి, గద్దిబోయిన కృష్ణారావు, ఎంఏబేగ్ పాల్గొన్నారు.


