13 మంది డీటీలకు పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

13 మంది డీటీలకు పదోన్నతులు

Jun 4 2026 7:09 AM | Updated on Jun 4 2026 7:09 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో 13 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. వీరిలో 8 మంది ప్రోడీటీలు, ఐదుగురు పదోన్నతిపై, ఒకరు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరిని అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేటాయించారు. పదోన్నతి పొందిన వారిలో బి శ్రీదేవి, ఎం.చక్రవర్తి, బి.హేమసుందర్‌రావు, పి.శ్రీనివాసరావు, ఆర్‌.వెంకటేశ్‌, ఎం.సరిత, ఎం.నలినాక్షి, డి.పద్మావతి, ఎల్‌ఎల్‌.నాయుడు, జీఎల్‌ఈ శ్రీనివాసరావు, బి.గోపాల్‌, రషీద్‌ అహ్మద్‌, ఎస్‌.రామకృష్ణ, కె.కవిత ఉన్నారు.

డీపీఈ ఈఈగా సత్యనారాయణ

అరసవల్లి: విద్యుత్‌ శాఖ సర్కిల్‌ డీపీఈ ఈఈగా ఎల్‌.సత్యనారాయణ బుధవారం విధుల్లో చేరారు. తాజాగా జరిగిన బదిలీల్లో విజయనగరం సర్కిల్‌ నుంచి స్థానిక సర్కిల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ జీఎన్‌ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్థానిక డీపీఈ విభాగ సిబ్బందితో సమావేశమై విజిలెన్స్‌ విభాగంతో పాటుగా నిర్వర్తించాల్సిన విధులపై చర్చించారు. ఇంతవరకు సర్కిల్‌ డీపీఈ ఈఈగా విధులు నిర్వర్తించిన జి.శంకరరావు విజయనగరం సర్కిల్‌ టెక్నికల్‌ ఈఈగా బదిలీ అయ్యారు.

మేడ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

సంతబొమ్మాళి: కొల్లిపాడు గ్రామానికి చెందిన గొరుసు మోహన్‌ (41) అనే వ్యక్తి మేడపై నుంచి జారిపడి మృతి చెందాడు. మంగళవారం రాత్రి భోజనం చేసి మేడపైన నిద్రపోవడానికి మోహన్‌ వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో మూత్ర విసర్జనకు కిందకు దిగే సమయంలో జారిపడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మోహన్‌, అతని భార్య లక్ష్మి నెల్లూరులో కూలిపని చేస్తుంటారు. నెల రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. మోహన్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతబొమ్మాళి ఎస్‌ఐ వై.సింహాచలం తెలిపారు.

అర్హులందరికీ

‘మత్స్యకార సేవలో’ లబ్ధి

అరసవల్లి: వేట నిషేధ కాలంలో ఉపాధికి ప్రత్యామ్నయంగా తీర ప్రాంత వేట మత్స్యకార లబ్ధిదారులందరికీ ‘మత్స్యకార సేవలో’ పథకం కింద రూ.20 వేలు చొప్పున జమ అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ టి.సుమలత బుధవారం తెలిపారు. ప్రస్తుతానికి వివిధ కారణాలతో న గదు జమ కాని అర్హులని గుర్తించే పనిలో ఉన్నా మని వివరించారు. జిల్లాలో 17635 దర ఖాస్తులు అప్‌లోడ్‌ చేయగా 16737 మందిని అర్హులుగా గుర్తించి నగదు జమ చేయించామన్నారు. ఇందులో 542 మంది దరఖాస్తులు ప్రోసెసింగ్‌లోనే ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పథకం లబ్ధి అందిందా లేదా అన్న అంశంపై సమాచార సేకరణ చేపడుతున్నామని, ఈ క్రమంలో ఫోన్లకు రెస్పాండ్‌ అవ్వాలని విజ్ఞప్తి చేశారు.

బాల పురస్కారాలకు

దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ – 2027’ అవార్డులకు అర్హులైన బాలబాలికల నుంచి దరఖాస్తులు, నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన చిన్నారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోందని, ఇందుకోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ ప్రారంభమైందని పేర్కొన్నారు. ధైర్యసాహసాలు, సామా జిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు–సంస్కృతి, సరికొత్త ఆవిష్కరణలు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత తదితర రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన బాలలు అర్హులని వివరించారు. 2026 జూలై 31 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 18 సంవత్సరాల లోపు ఉన్న భారతీయ పౌరులు, దేశంలో నివసిస్తున్న బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన బాలలు స్వయంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, లేనిపక్షంలో వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు కూడా చిన్నారుల పేర్లను నామినేట్‌ చేయవచ్చన్నారు. పూర్తి వివరాలతో అధికారిక వెబ్‌సైట్‌ http://awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జూలై 31 ఆఖరు తేదీగా పేర్కొన్నారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, శిశు సంరక్షణ కేంద్రాలు విస్తృత ప్రచారం కల్పించి అర్హులైన చిన్నారులు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement