ఎరువుల అక్రమ విక్రయాలపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

ఎరువుల అక్రమ విక్రయాలపై ఉక్కుపాదం

Jun 4 2026 7:09 AM | Updated on Jun 4 2026 7:09 AM

70 బస్తాల యూరియా స్వాధీనం

నరస్ననపేట: జమ్ము పంచాయతీ దశుమంతపురంలో అక్రమంగా నిల్వ చేసిన 70 బస్తాల యూరియాను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం సీజ్‌ చేశారు. వీటిని చల్లపేటలో ఎరువుల షాపు నిర్వహిస్తున్న ఎ.ధర్మరాజుకు చెందినవిగా గుర్తించామని విజిలెన్స్‌ ఎస్సై రామారావు తెలిపారు. సీజ్‌ చేసిన యూరియా బస్తాలను నరసన్నపేట వ్యవసాయాశాఖ ఏఓకి అప్పగించామన్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో ఎరువుల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ హెచ్చరించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, మార్క్‌ఫెడ్‌, డీసీఎంఎస్‌ ప్రతినిధులు, తయారీ కంపెనీల ప్రతినిధులు, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. కృత్రిమ కొరత సష్టించినా, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించినా, ఇతర ద్వితీయ శ్రేణి ఉత్పత్తులను అంటగట్టినా లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా ఫెర్టిలైజర్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ నిబంధనల ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఎరువుల తయారీ కంపెనీలు తమ కోటాలో 50 శాతం వాటాను డీలర్లకు కేటాయించేటప్పుడు జిల్లా వ్యవసాయ అధికారికి ముందస్తు సమాచారం అందించాలన్నారు. పంట విస్తీర్ణం ఆధారంగా అవసరమైన మండలాలకే సరఫరా జరిగేలా చూడాలన్నారు. రిటైల్‌ దుకాణాల్లో ఉన్న భౌతిక స్టాక్‌ కచ్చితంగా ఈ–పోస్‌ మిషన్లలోని రికార్డులతో సరిపోలాలన్నారు. ధరా వ్యత్యాసాలను ఆశించి అడ్వాన్స్‌ బుకింగ్‌లు చేసుకోవడం, రైతుల గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.

సంస్థాగత ఏజెన్సీలు సైతం ప్రైవేట్‌ డీలర్లకు సమానంగా, పారదర్శకంగా చట్ట నిబంధనలకు లోబడి వ్యాపారం సాగించాలని స్పష్టం చేశారు. మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు నిరంతరం తనిఖీలు చేపట్టాలని, లబ్ధిదారులైన రైతులను స్వయంగా గుర్తించాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేలా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో 40 శాతం సేంద్రీయ, 60 శాతం రసాయన ఎరువుల సమతుల్య వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వై.వి.మురళీకృష్ణ, జిల్లా సహకార అధికారి బి.మురళీకృష్ణ, జిల్లా మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ కె.యు.బి.పి.రమణి, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, డీసీఎంఎస్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement