● గెడ్డకంచరాంలో పశువులశాల రేకులు పడి వ్యక్తి మృతి
● మరో మహిళకు తీవ్ర గాయాలు
జి.సిగడాం : గెడ్డకంచరాంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బుధవారం సాయంత్రం గాలివాన ధాటికి పశువుల శాల రేకు ఎగిరిపడటంతో గ్రామానికి చెందిన నక్క సూరప్పడు (60) మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన నక్క మంగమ్మకు తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరూ పంట పొలంలో పశువులను మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షంమొదలవ్వడంతో పశువులను ఇంటికి తోలుకువస్తున్న సమయంలో పశువుల శాల రేకులు ఎగిరిపడటంతో సూరప్పుడు రెండుకాళ్లు సగానికి తెగి పడ్డాయి. తీవ్రరక్త్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈయనకు భార్య మల్లెమ్మ, కుమారుడు సూర్యనారాయణ ఉన్నారు. ఇదే ఘటనలో మంగమ్మ సైతం తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై తమకు ఎటువంటి సమాచారం రాలేదని పోలీసులు పేర్కొన్నారు.
నక్క సూరప్పడు(ఫైల్)


