● జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 100లోపు ర్యాంకులు లేకపోవడం ఇదే తొలిసారి
● కాస్త మెరుగైన ర్యాంకులతో ఐఐటీ, ఎన్‌ఐటీ సంస్థల్లో మనోళ్లకు సీట్లు
శ్రీకాకుళం న్యూకాలనీ: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 100లోపు ర్యాంకు లేకపోవడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. టాప్ ర్యాంకులు సాధించకపోయినా.. తమ వ్యక్తిగత ప్రతిభ ద్వారా మెరుగైన ఫలితాలతో ఫరవాలేదనిపించారు. గుర్తింపు పొందిన ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ సీట్లను సాధించబోతున్నారు.
నరసన్నపేట: మండలంలోని దూకులపాడుకు చెందిన అల్లు రోహిత్, నరసన్నపేట ఇందిరా నగర్‌కు చెందిన తండ్యాల పవన్ సాయిలు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో సత్తా చాటారు. రోహిత్ జాతీయ స్థాయి(ఓపెన్ కేటగిరీలో)102 వ ర్యాంకును ఓబీసీ కేటగిరీలో 14 వ ర్యాంకును కై వసం చేసుకున్నారు. రోహిత్ తల్లిదండ్రులు షణ్ముణరావు, లలితాంబలు ఆనందం వ్యక్తం చేశారు. షణ్ముఖరావు ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా తల్లి గృహిణి. అలాగే నరసన్నపేట ఇందిరా నగర్‌కు చెందిన తండ్యాల పవన్ సాయి ఓపెన్ కేటగిరీలో 702 వ ర్యాంకును ఓబీసీ కేటగిరీలో 118 వ ర్యాంకును సాధించాడు. పవన్‌సాయి తల్లిదండ్రులు జనార్దనరావు, పద్మావతిలు ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు
పొందూరు: పొందూరు పట్టణానికి చెందిన కోరుకొండ శ్రావ్య ఆల్ ఇండియా 111వ ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 17వ ర్యాంకు సాధించింది. తండ్రి కోరుకొండ కృష్ణారావు ఉపాధ్యాయులు, తల్లి లక్ష్మికాంతం ప్రైవేటు ఉపాధ్యాయురాలు.
పాతపట్నం: పాతపట్నం మండలం లాబర గ్రామానికి చెందిన కొండాల కనిష్క్ ఆల్ ఇండియా 221వ ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 36వ ర్యాంకు సాధించాడు. తండ్రి కొండాల చక్రపతి పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. తల్లి పుష్పలత పాతపట్నం మండలంలోని తామర ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
రణస్థలం: లావేరు మండలంలోని పెద రొంపివలస గ్రామానికి చెందిన గొర్లె ప్రవీణ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 296వ ర్యాంక్ సాధించారు. ఓబీసీ కేటగిరిలో 48వ ర్యాంక్ సాధించాడు. తండ్రి శ్రీరాములు రైల్వే మెకానికల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. తల్లి గొర్లె భారతి గృహిణి.
రణస్థలం: జేఆర్ పురం గ్రామానికి చెందిన జ్యోతి ప్రకాష్ అమూజూరు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 622వ ర్యాంక్, ఓబీసీ కేటగిరిలో 104వ ర్యాంక్ సాధించాడు. తండ్రి అమూజూరు శ్రీనివాసరావు అర్మీలో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. తల్లి గంగ గృహిణి.
ఎచ్చెర్ల: కుశాలపురం గ్రామానికి చెందిన పైడి దినేష్ జాతీయ స్థాయిలో 1006 ర్యాంక్‌ను సాధించాడు. తండ్రి లక్ష్మీపతి న్యాయవాది. తల్లి నిర్మల టీచర్.
రణస్థలం: మండలంలోని పతివాడపాలెం గ్రామానికి చెందిన మహంతి హర్షవర్ధన్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 1163వ ర్యాంక్ సాధించారు. ఓబీసీ కేటగిరిలో 199వ ర్యాంక్ సాధించాడు. తండ్రి మహంతి అప్పలనాయుడు అరబిందో పరిశ్రమలో ఉద్యోగి. తల్లి రమాదేవి గృహిణి.
నరసన్నపేట: స్థానిక ఇందిరానగర్‌కు చెందిన పాగోటి సాత్విక్ 2401వ ర్యాంకు సాదించాడు. ఓబీసీ కేటగిరీలో 460 వ ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రులు వాసుదేవరావు, ఝాన్సీ ఇద్దరూ ఉపాధ్యాయులే. స్వగ్రామం సారవకోట మండలం అలుదు.
వజ్రపుకొత్తూరు: మండల కేంద్రంలో పశువైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న మెట్ట పాపారావు కుమారుడు మెట్ట వెంకట సాయి సరాగ్ జేఈఈ అడ్వాన్స్‌లో ఓబీసీ కేటగిరీ ర్యాంక్ 466, ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంక్ 2418 సాధించాడు. స్వగ్రామం కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు కాగా శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. తల్లి పద్మలత పోలాకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్.


