● ఎయిర్‌పోర్టు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి ● బాధిత రైతుల ఆవేదన
వజ్రపుకొత్తూరు రూరల్:
పచ్చని చెట్లుతో కోనసీమను తలపించే ఉద్దాన ప్రాంతంలో అభివృద్ధి పేరిట విధ్వంసం చేయడానికి ప్రభుత్వం తలపెట్టిన ఎయిర్ పోర్టు ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని బాధిత రైతులు కోరారు. మండలంలోని బాధిత గ్రామమైన వంకులూరులో శుక్రవారం సాయంత్రం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో భూ సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగితే పిల్లల భవిష్యత్ బాగుంటుందని, పనుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. దీంతో ఈ సమావేశానికి హాజరైన రైతులు కలెక్టర్ వద్ద తమ గోడును విన్నవించుకున్నారు. ఎన్నో ఏళ్లగా ఈ ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, నేడు ఎయిర్‌పోర్టు కోసం ఈ భూములు ఇస్తే సర్వం కోల్పోయి వీధిన పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. అయితే విధ్వంసాన్ని కోరుకోవడం లేదని తెల్చి చెప్పారు. నిత్యం ఆహ్లాదకంగా ఉండే ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపడితే పర్యావరణానికి ముప్పు కలుగుతుందన్నారు. అనంతరం ఎయిర్‌పోర్టు ప్రతిపాదన రద్దు చేసుకోవాలని కోరుతూ బర్రివానిపేట గ్రామ బాలాజీ సేవా సంఘం, వంకులూరు గ్రామ శ్రీఆదిబలిజ సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, పలాస ఆర్డీవో అప్పలరాజు, తహసీల్దార్ సీతారామయ్య, డీటీ శ్రావణ్, రైతులు జోగి అప్పారావు, లండ రామస్వామీ, జోగి పురుషోత్తం, వల్లభరావు, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎం.గంగువాడలో రైతులతో సమావేశం
మందస: మండలంలోని ఎం.గంగువాడ గ్రామంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్గో ఎయిర్‌పోర్టు గురించి బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టుకు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. పచ్చని ఉద్దానంలో ఎయిర్ పోర్టు కట్టి తమ పొట్టలు కొట్టవద్దని కోరారు. కాగా ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాలైన భేతాళపురం, బీడిమి, తెలగ గంగువాడ, రట్టి గ్రామాల రైతులు కలెక్ట్‌రు వస్తారని వినతులతో ఎదురు చేశారు. కానీ ఆయన రాకపోవడంతో నిరాశ చెందారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.వేణుగోపాల్, ఆర్డీవో అప్పలరాజు, డిప్యూటీ తహసీల్దార్ కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


