స్థలం చుట్టూ కర్రలు పాతిన టీడీపీ నేత
సంతబొమ్మాళి: మూలపేట పోర్టుతో నౌపడలో భూములకు విలువ పెరగడంతో ప్రభుత్వ స్థలం కనబడితే చాలు వెంటనే అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. తాజాగా మండలంలోని నౌపడ నుంచి వెంకటాపురం వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఆనుకొని నౌపడ పోలీస్‌స్టేషన్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక టీడీపీ నాయకుడు ఆక్రమణ చేశారు. సర్వే నంబర్ 386లో రోడ్డుకు అనుకుని ఉన్న సుమారు 6 సెంట్ల ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆక్రమించిన స్థలం చుట్టూ పొడవైన కర్రలు పాతాడు. ఆక్రమించిన భూమి విలువ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.50 లక్షల వరకు ఉంటుంది.
పట్టించుకోని అధికారులు
ఈ స్థలం పక్క నుంచే ప్రతిరోజూ అధికారులు రాకపోకలు సాగిస్తున్నా తమకేమి పట్టనట్లు వ్యవహరించారు. దీంతో ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించారు. ఆక్రమణలు తొలగించాలని అధికారులు పలుమార్లు చెప్పినా సదరు టీడీపీ నాయకుడు పట్టించుకోలేదు. అది తమ ఆధీనంలో ఉన్న భూమి అని, దీనికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని అధికారులకు చెబుతున్నాడు. అయితే పత్రాలు చూపించమని అధికారులు అడిగితే సదరు టీడీపీ నేత ఇవ్వకపోవడం కొసమెరుపు. అందువలన ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి యు.ఉమాపతిని అడగగా ఆక్రమించినది ప్రభుత్వ భూమి అని, ఆక్రమణలు తొలగించాలని పలుమార్లు చెప్పడం జరిగిందన్నారు. తొలగించకపోవడంతో శుక్రవారం నోటీసులు ఇచ్చామని తెలియజేశారు.


