టీడీపీ.. ఓ వెన్నుపోటు పార్టీ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ.. ఓ వెన్నుపోటు పార్టీ

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

నరసన్నపేట: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటోందని, దీన్ని తట్టుకోలేక వైఎస్సార్‌ సీపీని గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఆయన సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వాస్తవానికి టీడీపీ.. ఓ వెన్నుపోటు పార్టీ అని ఎద్దేవా చేశా రు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌ను ఆనాడు వైశ్రాయ్‌ హొటల్‌లో నీచాతినీచంగా అవమానించడం, చెప్పులతో కొట్టడం మరిచిపోయారా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీని ఆయనకే వెన్నుపోటు పొడిచి లాక్కోవడం ఎవ రికి తెలీదు అంటూ నిప్పులు చెరిగారు. ‘అధికారం వచ్చాక ఎంతో దారుణంగా పాలన చేస్తున్నారు. ఎంతో మంది వైఎస్సార్‌ సీపీ నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులతో జైల్లో పెట్టారు. మాది గొడ్డలి పార్టీ అంటున్నారు. ఇది మీకు తగదు.’ అని హితవు పలికారు. ప్రతీదీ లెక్క వేసుకుంటూనే ఉన్నామని, వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తారనే భయం ఇప్పటి నుంచే టీడీపీ నాయకుల్లో మొదలైందని, అందుకే కువిమర్శలు చేస్తున్నారని అన్నారు. నరసన్నపేటకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ప్రజలను తప్పు దోవ పట్టించేలా ఆయన మాటలు ఉన్నాయన్నారు. మీరెన్ని తప్పుడు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా.. జగన్‌ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని కృష్ణదాస్‌ అన్నారు. ‘అచ్చెన్నా.. నువ్వు కూడా వైఎస్సార్‌సీపీని గొడ్డలి పార్టీ అని అంటున్నావు. మీ ఇంట్లో జరిగిన వ్యవహరాలు జిల్లా ప్రజలకు తెలీంది కాదు.’ అని కృష్ణదాస్‌ అన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు అంధవరపు సూరిబాబుతదితరులు పాల్గొన్నారు.

● నిప్పులు చెరిగిన వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

Advertisement
 
Advertisement
Advertisement