శ్రీకాకుళం: జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలతో పాటు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ పరీక్షలకు రెగ్యులర్ సప్లిమెంటరీ విభాగం నుంచి 1,664 మంది, ఓపెన్ స్కూల్ విభాగం నుంచి 1,460 మంది చొప్పున, మొత్తం 3,124 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
టెక్కలి: సంతబొమ్మాళికి చెందిన మాజీ సర్పంచ్ కళింగపట్నం లక్ష్మీ, అప్పారావు దంపతుల కుమారుడు కళింగపట్నం ప్రభుకుమార్ అత్యంత సాహసమైన ఉమ్‌లింగ్ లా శిఖరాన్ని అధిరోహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. మే 5న ద్విచక్రవాహనంపై మొదలుపెట్టిన ఈ సాహసయాత్ర సుమారు 16 రోజులు కొనసాగింది. చివరగా లడక్ లోని 19,024 ఎత్తులో ఉన్న ఈ శిఖరాన్ని అధిరోహించారు. ఈ సందర్భంగా సంతబొమ్మాళి వాసులతో పాటు పలువురు ప్రభుకుమార్‌ను అభినందించారు.
శ్రీకాకుళం క్రైమ్ : దర్యాప్తు అధికారులు (ఐవోలు), పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (పీపీలు) మధ్య సమన్వయం పెంపొందించి కేసుల దర్యాప్తు, విచారణలను వేగవంతం చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసులతో పాటు పీపీలతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోక్సో కేసుల దర్యాప్తు, అభియోగపత్రాలు (ఛార్జిషీట్లు) దాఖలులో పాటించాల్సిన జాగ్రత్తలు, కోర్టు సమన్లు సకాల అమలు, గ్రేవ్ కేసులు, నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ల అమలుపై సమీక్షించారు. సైబర్ ఆర్థిక నేరాల్లో బాధితులు కోల్పోయిన నగదును కోర్టుల ఆదేశాల మేరకు తిరిగి పొందేలా చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు ముమ్మరం చేయాలని, హిట్ అండ్ రన్ ప్రమాద కేసుల్లో పురోగతి సాధించి దర్యాప్తు పూర్తిచేయాలన్నారు. పరారీలో ఉన్న ముద్దాయిలను గుర్తించి చార్జిషీటు దాఖలు చేయాలన్నారు.


