ఈదురు
గాలులు..
రణస్థలం: ఎచ్చెర్ల నియోజకవర్గంలో శుక్రవారం వీచిన ఈదురుగాలులు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. అరటి, కొబ్బరి, మొక్కజొన్న, బొప్పాయి పంటలు నేలకొరిగి తీరని నష్టాన్ని మిగిల్చాయి. లావేరు, రణస్థలం మండలాల్లోని గోసాం, వెంకటరావుపేట, నగరప్పాలెం, వల్లభరావుపేట తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో అరటి, బొప్పాయి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు.
జి.సిగడాం : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షం, ఈదురుగాలులు రైతులను కుదేలు చేశాయి. ఉల్లివలస, ఎల్లయ్యపేట, జాడ, వెంకయ్యపేట, పున్నాం గ్రామాల్లో సుమారు 50 ఎకరాలలో అరటి పంట నేల పాలయ్యింది. ఎకరాకు సుమారు రూ.80 వేలు మదుపులు పెట్టామని, పంట చేతికొస్తున్న సమయంలో ఇటువంటి గాలులు రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఎచ్చెర్ల : మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు చెట్లు, స్తంభాలు ఒరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, రేకులు విరిగిపడి ఉన్నాయి. దీంతో వీటిని సరిచేయడానికి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రం, విద్యుత్ కార్యాలయం, ఆర్టీవో కార్యాలయానికి వెళ్లిన రహదారిలో, కొయ్యాం రహదారి పొడవునా చెట్లు, స్తంభాలు వైర్లపై కూలిపోయాయి.


