● వంశధారలో ఇసుక దొంగలు
● అనుమతులు ఉండవు.. నిబంధనలు కానరావు
● నేతల కనుసన్నల్లోనే దందా
హిరమండలం:
వంశధారలో నీటి జాడలు కనిపించడం లేదు గానీ ఇసుక దొంగల జాడలు మాత్రం దారి పొడవునా కనిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టి నదీ తీర గ్రామాల ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రేవులను అధికారికంగా దక్కించుకున్న వారు ఒకవైపు, దొరికిన దగ్గర దొరికినట్టు మరికొందరు ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. అధికారుల అండదండలతో రాజకీయ పార్టీల నేతలు నిబంధనలు విస్మరించి వంశధారను గుల్ల చేస్తున్నారు.
ప్రధానంగా ‘ఇసుక మేట ల’ తొలగింపు పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రధానంగా కూటమికి చెందిన చోటా నేతలతో బడా నేతలు ఈ పర్వాన్ని కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అనుమతుల పేరుతో..
పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి వంశధార నదిలో రెండు చోట్ల మాత్రమే ఇసుక తవ్వేందుకు అనుమతులు ఉన్నాయి. కొత్తూరు, హిరమండలం మండలాల్లో ఇసుక మేటల తొలగింపు పేరిట ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. కొత్తూరు మండలంలోని బంకి, హిరమండలానికి సంబంధించి భగీరథపురం వద్ద ఇసుక దందా కొనసాగుతోంది. అయితే అనుమతుల పేరుతో అనధికారికంగానే యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. ఈ రెండు మండలాల్లో సమీప మార్గాల్లో ఏకంగా నది గర్భానికి రహదారులు నిర్మించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క పాతపట్నం నియోజకవర్గంలోనే వంశధార నది నుంచి రోజుకు వందలాది ఇసుక లోడ్లు తరలిపోతున్నాయి. ఎక్కడికక్కడే అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీ చేసి కేసులు నమోదు చేయాల్సిన మై నింగ్, రవాణా, పోలీసు, రెవె న్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. అధికారికంగా తవ్వకాలు చేపట్టినా నిబంధనలు తప్పకుండా పాటించాలి. అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండడంతో అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టి ఇసుక తవ్వకాలు, రవాణాను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.


