● భూములు కొల్లగొట్టేందుకే కూన కుట్ర
● కూనకు దమ్ముంటే కోర్టు ముందు వాస్తవాలు వ్యక్తం చేయాలి
● ఆమదాలవలస వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్
ఆమదాలవలస:
వివాదాస్పదమవుతున్న బావాజీ మఠం భూములు ప్రైవేటు వ్యక్తులవని, జిరాయితీ అని సుప్రీం కోర్టులో చెప్పారని ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పడం హాస్యాస్పదమని, అవి సదావర్తి భూములేనని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో బావా జీ మఠానికి చెందిన వ్యక్తులు అక్కడ నిర్మించిన జగన్నాథస్వామి, లక్ష్మీనర్సింహస్వామి ఆలయాల కోసం మాత్రమే కోర్టును ఆశ్రయించారని చింతాడ రవికుమార్ వెల్లడించారు. కోర్టు తీర్పులో కూడా మఠానికి చెందిన ఆస్తులకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. 22ఎ లో ఉన్న నిషేధిత భూములను ఎలా క్రయ విక్రయాలు జరుపుతారని పేర్కొన్నారు. అక్రమ లేవుట్‌కు ప్లాన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
తన పేరిట ఒక్క సెంటు అక్రమ భూమి లేదని కూన చెబుతున్నారని, అయితే కొత్తరోడ్డు సమీపంలో కూన పేరుపై 20 సెంట్లు భూమిలో భవనం ఉన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. గతంలో సరుబుజ్జిలి మండలం వెన్నెవలసలో 100 ఎకరాలు ఎక రా రెండు లక్షల రూపాయలకు కూన రవికుమార్, ఆయన సతీమణి పేర్లతో 2014–2019 మధ్య ఎలైనేషన్ పద్ధతిలో చేజిక్కించుకోవాలని దరఖాస్తు చేసిన మాట వాస్తవం కాదా అంటూ నిలదీశారు. ఇటీవల పొందూరు మండలం వీఆర్ గూడెంలో 10 ఎకరాలు ప్రభుత్వ భూమిని గణేష్ గాయిత్రీ స్టోన్ క్రషర్ పేరుపై ఎకరా రూ. ఏడు లక్షలకు పొందాలని దరఖాస్తు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ భూముల ఖరీదు ఎకరా సుమారు రూ. రెండున్నర కోట్ల వరకు ఉంటుందని చింతాడ చెప్పారు. ప్రభు త్వ భూములకు రక్షణ కల్పించాల్సిన ప్రజాప్రతినిధులే వాటిని భక్షించాలని చూడడం సిగ్గు చేటన్నారు.
గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని చెబుతున్న కూన సీఐడీ, విజిలెన్స్ విచారణ జరపగలరా అని సవాల్ చేశారు. మఠం భూములు, నిషేధిత భూములకు అక్కడ క్రయ విక్రయాలకు తోవ లేదని, అలాగే ఆ భూముల్లో ఎలాంటి లావాదేవీలు జరపకూడదంటూ కలెక్టర్ నుంచి సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలు అందాయని, అదే కాపీ తనకి కూడా కలెక్టర్ ఇచ్చారని చింతాడ రవికుమార్ వెల్లడించారు. బావాజీ మఠం సదావర్తి భూముల విషయంలో బహి రంగ చర్చకు రాగలరా అని ఎమ్మెల్యేకు బహిరంగ సవాలు విసిరారు. ఆక్రమణ లేఅవుట్లకు 1.45 కోట్ల రూపాయల ఎన్ ఆర్ ఈజీఎస్ నిధులతో రోడ్లూ, డ్రైనేజీ వేసి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసిన ఘనుడు ఎమ్మెల్యే కూన రవికుమార్ అని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, సరుబుజ్జిలి జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, పార్టీ ముఖ్యనాయకులు బద్రి రామారావు, బొడ్డేపల్లి నాగరాజు, బెవర మల్లేసు, నవీన్, పొన్నాడ చిన్నారావు, మన్మధరావు, సంజయ్, తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.


