● ముఖ్యమంత్రి పర్యటన నిరాశ కలిగించింది
● రైతు సమస్యలను
పట్టించుకోనేలేదు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందరి ఆశలపై నీళ్లు చల్లి వెళ్లిపోయారని, ప్రచార ఆర్భాటమే తప్ప జిల్లాకు ఒరిగిందేమీ లేదని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం పర్యటన కోట్ల రూపాయల ఖర్చు తప్ప జిల్లా, నరసన్నపేట ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని అన్నారు. మొక్క జొన్న మద్దతు ధరపై ఏమైనా ప్రకటన వస్తుందని ఆశపడిన రైతులకు నిరాశ కలిగిందన్నారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన అరటి రైతులు సైతం సీఎం స్పందన కోసం ఎదురు చూశారని, కానీ అవేమీ పట్టించుకోకుండా పాత హామీలను వల్లె వేసి వెళ్లిపోయారని విమర్శించారు. వైద్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సమస్యలు ప్రస్తావించకుండా మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ.40వేలు ఇస్తానని హామీ ఇవ్వడం సబబు కాదన్నారు.
శ్రీకాకుళం జిల్లా వెనుకబడి ఉందని సీఎం ఒప్పుకున్నారని, అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పలేదన్నారు. జిల్లా వెనుకబాటుకు టీడీపీనే కారణమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో జి ల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. అవమానంగా లేదా.. అని అన్నారు. అసలు సిసలు గొడ్డలి పార్టీ అంటే టీడీపీయేనని అన్నారు. అధికారంలోకి వచ్చాక వేధింపులే పరమావధిగా పనిచేస్తున్నారని తెలిపారు.
మద్యం అక్రమ విక్రయాలు, ఇసుక దందా
జిల్లాలో మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారని, బీరు, ఇతర కొన్ని బాటిల్స్ పై రూ. 10 అదనంగా తీసుకుంటున్నారని, ఈ అధికారం ఎవరు ఇచ్చా రని పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య నిలదీశారు. నరసన్నపేటలో అనేక సమస్యలు, ఆక్రమణలు కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందించలేదన్నారు.


