బిల్లులు అదుపు! | - | Sakshi
Sakshi News home page

బిల్లులు అదుపు!

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

విద్యుత్‌ పొదుపు.. బిల్లులు అదుపు! ● ఎండలు నేపథ్యంలో భారీగా పెరుగుతున్న బిల్లులు ● పొదుపు చర్యలు పాటించాలంటున్న అధికారులు

అవగాహన కల్పిస్తున్నాం

విద్యుత్‌ పొదుపు..
● ఎండలు నేపథ్యంలో భారీగా పెరుగుతున్న బిల్లులు ● పొదుపు చర్యలు పాటించాలంటున్న అధికారులు

హిరమండలం: వేసవి ఎండలు ఠారెత్తిస్తున్న ప్రస్తుత తరుణంలో ఫ్యాన్లు, ఏసీల వినియోగం బాగా పెరిగింది. దీంతో విద్యుత్‌ బిల్లుల మోత మోగిపోతోంది. ఈ నేపథ్యంలో వేసవిలో విద్యుత్‌ను ఆదా చేసేందుకు ఉన్న అన్ని రకాల అవకాశాలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం అన్నివర్గాల వారు తమ స్థాయిని బట్టి వేడి నుంచి ఉపశమనం పొందే విద్యుత్‌ పరికరాల వాడకం పెంచారు. వాస్తవానికి వేసవిలో విద్యుత్‌ వాడకం అధికంగానే ఉంటుంది. గతంలో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వంలో ట్రూఆప్‌ చార్జీల పేరిట విద్యుత్‌ బిల్లుల మోత మోగుతోంది. ఈ తరుణంలో బిల్లుల భారం నుంచి కొంత మేర ఉపశమనం పొందేందుకు పొదుపు ఒక్కటే సరైన మార్గమని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఎల్‌ఈడీలు మేలు..

వీలైంతవరకు పగటి పూట విద్యుత్‌ బల్బులు వాడకాన్ని తగ్గించుకోవాలి. సహజ వెలుగులో భాగంగా సూర్యరశ్మి ఇళ్లల్లోకి వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం మేలు. దీని వల్ల మిటమిన్‌–డీ తో పాటు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చు. ఫిల్మెంట్‌ బల్బులకు బదులు 8 రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేసే ఎల్‌ఈడీలను వినియోగించాలి. ట్యూబులైట్లకు ఎలక్ట్రానిక్‌ చోక్‌ అమర్చుకోవడం వల్ల విద్యుత్‌ను ఆదాచేయవచ్చు. ఫ్యాన్లు వాడేటప్పుడు రెగ్యులేటర్లను ఏర్పాటు చేసుకోవాలి.

ఫ్రిజ్‌లు..

రిఫ్రిజిరేటర్ల వాడకంతో అధిక విద్యుత్‌ ఖర్చయ్యే అవకాశముంది. దీనిని నివారించేందుకు ఫ్రిజ్‌ తలుపులు అధికంగా తెరవకూడదు. ఫ్రిజ్‌ థర్మో స్టార్ట్‌ మధ్యస్తంగా ఉంచుకోవాలి. ఫ్రిజ్‌లను వేడి అధికంగా ఉండే ప్రదేశాల్లో కాకుండా నీడ ప్రదేశంలో ఉంచడం వల్ల త్వరితగతంగా చల్లబడి విద్యుత్‌ ఆదా అవుతోంది. గోడలకు ఫ్రిజ్‌ను ఆనించి ఉంచరాదని నిపుణులు సూచిస్తున్నారు.

ఏసీలు..

సామాన్యమైన చల్లదనానికి 26 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద ఎయిర్‌ కండీషనర్‌ వాడకంతో విద్యుత్‌ ఆదా అవుతుంది. ఒక్కో సెంటీగ్రేడ్‌ తగ్గించుకోవడం వల్ల 8 శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది. ఏసీ ఫిల్టర్లను నెలకోసారి శుభ్రం చేసుకోవడం వల్ల కూడా విద్యుత్‌ ఖర్చు తగ్గించుకోవచ్చు.

వాషింగ్‌ మెషీన్లు, గీజర్లు..

వాషింగ్‌ మెషీన్లు వాడకం వల్ల కూడా అధిక విద్యుత్‌ బిల్లులు వచ్చే అవకాశం ఉంది. దీనిని తగ్గించుకునేందుకు మెషీన్‌ టైమర్లను సక్రమంగా అనుసరించడం, ఎలక్ట్రిక్‌ డ్రైయింగ్‌ ద్వారా కాకుండా దుస్తులను ఉతికిన తరువాత వాటిని తీసి ఆరుబయట ఎండలో ఆరవేసుకోవడం మేలు. సాయంత్రం 6 నుంచి 10 గంటల సమయంలో వాషింగ్‌ మెషీన్ల వాడకం తగ్గించుకోవాలి. గీజర్లు విషయంలో అవసరమున్నప్పుడు మాత్రమే వాడటం మంచిది. దీనికి కూడా థర్మోస్టాట్‌ 35 నుంచి 45 డిగ్రీల మధ్యలో ఉంచాలి.

విద్యుత్‌ను ఆదా చేయడమంటే ఉత్పత్తి చేయడంగా భావించాలి. వేసవిలో విద్యుత్‌ పొదుపుగా వాడటం మంచిది. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా లాభపడవచ్చు. ఇప్పటికే మా సిబ్బంది విద్యుత్‌ పొదుపుపై అవగాహన కల్పిస్తున్నారు. పొదుపు,జాగ్రత్తల వల్ల మాత్రమే విద్యుత్‌ ఆదా సాధ్యమవుతంది.

– జి.ప్రసాదరావు,

విద్యుత్‌ శాఖ డీఈ, పాతపట్నం

Advertisement
 
Advertisement
Advertisement