టెక్కలి రూరల్: కండికిపేట గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కండికిపేట గ్రామానికి చెందిన బుడితి ఆనందరావు(55) పొలం పనులు నిమిత్తం రాధావల్లభపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ను తీసుకుని వస్తూ స్వగ్రామం దగ్గరలో ఉన్న వంశధార కాలువ బ్రిడ్జి దాటుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఆనందరావు ట్రాక్టర్ కింద చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు.
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
పొందూరు: గోకర్నపల్లి గ్రామానికి చెందిన కిల్లి అప్పలసూరి(50) రైలు ప్రమాదంలో మృతి చెందాడని శ్రీకాకుళం రైల్వే ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. శనివారం రాత్రి అప్పలసూరి బహిర్భూమికి వెళ్తానని చెప్పి ఇంటికి రాకపోవడంతో భార్య వనజాక్షి వెతికింది. గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు. గుర్తు తెలియని రైలు ఢీకొని మృతి చెంది ఉండవచ్చని రైల్వే పోలీసులు చెబుతున్నారు. అప్పలసూరికి భార్య వనజాక్షి, కుమార్తె విమల ఉన్నారు. రైల్వే ఎస్‌ఐ మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


