ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర బార్ అండ్ రెస్టారెంట్‌లో ఓ యువకుడు ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మున్సిపాలిటీలోని నాలుగో వార్డు, శ్రీకాకుళం రూరల్ మండలం కసింవలసకు చెందిన సరిబిల్లి నాగేశ్వరరావు తన తమ్ముడు సరిబిల్లి దుర్గారావు (31)తో కలిసి ఆదివారం మధ్యాహ్నం గేదెలవానిపేటలో ఓ కార్యక్రమానికి బయలుదేరారు. మార్గమధ్యలో బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఆగి ఇద్దరూ మద్యం సేవించారు. అనంతరం నాగేశ్వరరావు తన తమ్ముడిని అక్కడే ఉంచి గేదెలవానిపేటలో జరిగే ఫంక్షన్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి దుర్గారావు బార్ పైగదిలో అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే దుర్గారావు మృతి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై–2 ఎస్.కాంతారావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
వ్యాన్ ఢీకొని యువకుడు మృతి
సారవకోట: పెద్దలంబ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన బత్తిలి గణపతి(36) మృతి చెందాడు. చేపలు కొనేందుకు బొంతు జంక్షన్‌కు వచ్చి తిరిగి రామచంద్రాపురం వెళ్తుండగా పెద్దలంబ సమీపంలో ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. గణపతికి భార్య గాయిత్రి, ఇద్దరు కుమార్తెలు దీక్ష, మౌళిక ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వ్యాన్ డ్రైవర్ సింహాచలాన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ భాస్కరరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు.


