పలాస: విప్లవాలు, ఉద్యమాలు, దళాలకు చిరపరిచితమైన శ్రీకాకుళంలో ఇక ఆ పదాలన్నీ గతం కానున్నాయి. ఉద్యమాల పురిటి గెడ్డ ఉద్దానం ప్రాంతానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు అజ్ఞాత జీవితం వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. ఆపరేషన్ కగార్ తర్వాత సాయుధ దళాలు, దండకారణ్య ఉద్యమానికి గుండెకాయ లాంటి నాయకులు ఒక్కొక్కరుగా లొంగిపోయారు. ఇప్పుడు వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరు నారాయణరావు విజయవాడలో సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిన తర్వాత ఉద్దానం ప్రాంతంలో ఎక్కడ చూసినా మావోయిస్టుల కోసం చర్చలు మొదలయ్యాయి. గత ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను, వారి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
నక్సల్బరీ పోరాట స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా సాయుధ గిరిజన రైతాంగ పోరాటం 1969లో ప్రారంభమై 1970 కల్లా ఒక్క ఏడాదిలోనే చల్లారిపోయింది. ఆ నాటి పోరాటంలో పాల్గొన్న సాయుధ దళాల సభ్యులు, నాయకులు సుమారు 360 మంది పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. ఆ తర్వాత సాయుధ పోరాటం తాత్కాలికంగా విరమిస్తూ అప్పటి మిగిలిన నాయకత్వం తిరిగి చట్టపరధి ఉద్యమాలకు పున రంకితమైంది. అప్పటికి మిగిలి ఉన్న పైలా వాసుదేవరావు, పోతనపల్లి అప్పలస్వామి, గొరకల రాంబాబు, పైలా చంద్రమ్మ, పోతనపల్లి జయమ్మ, పోతనపల్లి పారమ్మలు అజ్ఞాత జీవితం మాత్రం వీడలేదు. రహస్యంగా ఉంటూనే పార్టీ కార్యక్రమాలను సాగించారు. 1977 తర్వాత తరిగి జిల్లాలో ప్రజాఉద్యమాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే 1980 ప్రాంతం నుంచి 1990 వరకు పీపుల్స్‌వార్ ఉద్దానం కేంద్రంగా చేసుకొని సాయుధ దళాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసింది. జిల్లాలో అనేక సాయుధ చర్యల తర్వాత పోలీసు నిర్భందం పెరిగింది. అలా పోలీసు నిర్భందం నేపథ్యంలోనే బాతుపురం, పల్లిసారథి, బొడ్డపాడు, అక్కుపల్లి, ఒంకులూరు, బహాడపల్లి, నీలావతి, మాకన్నపల్లి, మామిడిపల్లి, మర్రిపాడు గడూరు తదితర గ్రామాల నుంచి రాడికల్ యువజన సంఘం, రాడికల్ విద్యార్థి సంఘం తదితర ప్రజాసంఘాల నుంచి అత్యధిక సంఖ్యంలో ఉద్దానం ప్రాంతం గ్రామాల నుంచి యువకులు పీపుల్స్ వార్ సాయుధ దళాల బాట పట్టారు.
అనంతరం జిల్లాలో పోలీసు నిర్భందం పెరగడం, ప్రజల నుంచి తగిన సహకారం లేకపోవడంతో ఒడిశా సరిహద్దు గ్రామాలకు దళాలు వెళ్లిపోయాయి. అనంతరం పీపుల్స్‌వార్ మావోయిస్టు పార్టీగా మారడం దండకారణ్య అటవీ ప్రాంతానికి ఈ జిల్లా ఉద్యమం విస్తరించింది. అక్కడ కూడా సాయుధ పోరాటం తీవ్రం కావడంతో ఈ జిల్లాకు చెందిన అనేక మంది పోలీసు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. ఒక్క కోపర్ డాంగ్ ఎన్‌కౌంటర్‌లోనే ఉద్దానం ప్రాంతానికి చెందిన 18 మంది మృతి చెందారు. ఆ విధంగా అక్కుపల్లి గ్రామంలో 7 మంది, అత్యధికంగా చనిపోగా బొడ్డపాడు, నీలావతి, బాహాడపల్లి, బాతుపురం, ఒంకులూరు, మెట్టూరు, మామిడిపల్లి తదితర గ్రామాల్లో జిల్లా మొత్తం మీద 60 మంది మావోయిస్టులు మృతి చెందారు. చివరికి బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరు నారాయణరావు ఒక్కరే ఈ జిల్లా నుంచి మిగిలారు. ఇతను కూడా గత ఏడాది ఒడిశా సరిహద్దు గ్రామంలో పోలీసు కాల్పుల్లో మృతి చెందాడని, తప్పించుకున్నాడని వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే వారి ఇంటికి పోలీసులు కూడా వెళ్లి అతని కోసం వాకబు చేశారు. అయితే అనూహ్య రీతిలో సోమవారం విజయవాడలో పోలీసుల ఎదురుగా ప్రత్యక్షమవడంతో ఉద్దానంలో ఇక్కడ వారి ఉద్యమాలు, త్యాగాలు గురించి చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి నాయకులంతా లొంగిపోవడంతో నాటి ఉద్యమానికి గుర్తుగా పల్లెల్లో స్థూపాలు మిగిలాయి.
అజ్ఞాతం వీడిన ఏకై క మావోయిస్టు చెల్లూరు నారాయణ
ఇక జనజీవన స్రవంతిలోనే మావోలు
తొలి ఉద్యమంలో 360 మంది మృతి
మలి ఉద్యమంలో 60 మంది మృతి
శ్రీకాకుళం జిల్లాలో సాయుధ దళాలు లేనట్టే
30 ఏళ్ల అజ్ఞాత జీవితం
వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరు నారాయణరావు సుమారు 30 ఏళ్ల అజ్ఞాత జీవితం గడిపాడు. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన నారాయణరావు తల్లిదండ్రులు చనిపోగా ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు ఉన్నారు. ఇతను ఇంటర్ వరకు చదువుకున్నాడు. చదువుకునే సమయంలోనే రాడికల్ విద్యార్థి సంఘానికి ఆకర్షితుడై అందులో చురుగ్గా పనిచేశాడు. దీంతో 1990లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ దళంలోకి వెళ్లాడు. అక్కడ నుంచి ఎప్పుడు కూడా ఇంటి ముఖం చూడలేదు. దళ సభ్యుడు నుంచి అంచెలంచెలుగా మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుని స్థాయికి ఎదిగాడు. ఎన్నో సాయుధ చర్యల్లో పాల్గొని తప్పించుకున్న ఆయన నేడు ఈ విధంగా పోలీసులకు లొంగిపోవడం విశేషం.


