భార్య మెడపై బ్లేడ్‌తో దాడి | - | Sakshi
Sakshi News home page

భార్య మెడపై బ్లేడ్‌తో దాడి

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

రణస్థలం: లావేరు మండలంలోని కొత్తకుంకాం గ్రామానికి చెందిన కొవ్వూరు సంతోషినిపై ఆమె భర్త కొవ్వూరు రాము మద్యం మత్తులో బ్లేడ్‌తో మంగళవారం ఉదయం దాడి చేశాడు. ఆమె మెడపై గాయమవ్వడంతో 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వీరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. లావేరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

భర్తకు తలకొరివి పెట్టిన భార్య

నందిగాం: మండలంలోని హరిదాసుపురంలో భర్తకు భార్య తలకొరివి పెట్టిన విషాదకర ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శిష్ణు తమ్మయ్య, కాంతమ్మకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండేవారు. కుమార్తె చిన్నతనంలోనే మృతి చెందగా, వివాహం అయిన కుమారుడు తిరుపతిరావు ఐదేళ్ల క్రితం అనారోగ్య సమస్యతో మృతి చెందాడు. అయితే తమ్మయ్య(63) మంగళవారం వేకువజామున గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో, భార్య కాంతమ్మ తలకొరివి పెట్టింది.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి దుర్మరణం

కంచిలి: మండలంలోని పెద్ద శ్రీరాంపురం ఉన్నత పాఠశాల ఎదురుగా మెయిన్‌ రోడ్డుపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కవిటి మండలం తలగానపుట్టుగ గ్రామానికి చెందిన మదనాల పురుషోత్తం(29) అనే వ్యక్తి కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం మెయిన్‌రోడ్డుపై బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లగేజీ ఆటో ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఇతడికి సోంపేట ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు పురుషోత్తం ఖతార్‌ దేశం నుంచి స్వగ్రామానికి ఇటీవల వచ్చి, సోంపేట మండలం జింకిభద్ర గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుడికి నెల రోజుల్లో పెళ్లి కావాల్సి ఉండడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. తల్లి మదనాల దాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గ్రామ కంఠం భూమి ఆక్రమణ

రణస్థలం: లావేరు మండల కేంద్రంలోని సర్వే నంబర్‌ 242లో ఉన్న ప్రభుత్వ భూమి (గ్రామకంఠం)ని ఒక టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణపై గ్రామ పెద్దలు ఎన్నిసార్లు వారించినా వినకుండా తనపని చేసుకుంటున్నాడు. సదరు టీడీపీ నాయకుడు గతంలో ఈ స్థలం ఆక్రమణకు విశ్వ ప్రయత్నాలు చేసినా గ్రామ పెద్దలు ఒప్పుకోలేదు. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆక్రమణ పర్వానికి తెరలేపాడు. తన ఇంటికి ఆనుకుని 40 అడుగుల పొడవునా, 4 అడుగుల వెడల్పున ఆక్రమించేలా పక్కాగా కాంక్రీట్‌ నిర్మాణం చేపడుతున్నాడు. దీనిపై కొంతమంది కలెక్టర్‌ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందినా మండల, గ్రామస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని ఆక్రమణలు అడ్డుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement