కాపులు అణచివేతకు గురవుతున్నారు | - | Sakshi
Sakshi News home page

కాపులు అణచివేతకు గురవుతున్నారు

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

జనాభా ప్రాతిపదికన పదవులివ్వాలి

తూర్పుకాపుల ఆత్మీయ సభలో వక్తలు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో అధిక సంఖ్యలో తూర్పు కాపులున్నా.. మిగిలిన కులాల వద్ద అణచివేతకు గురవుతున్నామని తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం తూర్పుకాపుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో ఏ రాజకీయ పార్టీలైనా కాపులకే ప్రాధాన్యమివ్వాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలో ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు కాపుల ఐక్యతను చాటిచెబుతూ నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. సప్తగిరి కల్యాణ మండపం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్‌, డే అండ్‌ నైట్‌ కూడలి మీదుగా ఏడు రోడ్ల జంక్షన్‌ వరకు సాగింది. వైఎస్సార్‌ కూడలి వద్దకు చేరుకుని దివంగత గొర్లె శ్రీరాములు నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాజకీయ పార్టీల తీరుపై ఆగ్రహం

ఈ సందర్భంగా జరిగిన సమ్మేళనంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ, అన్ని రాజకీయ పార్టీలు ఈ సామాజిక వర్గాన్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నగరంలో జరిగిన కార్గిల్‌ పార్క్‌ ప్రారంభోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను ఖండించారు. సుడా చైర్మన్‌, కాపు సామాజికవర్గ బలమైన నాయకుడు కొరికాన రవికుమార్‌ ప్రోటోకాల్‌ విషయంలో జరిగిన అన్యాయం, తూర్పు కాపు జాతికి జరిగిన అవమానంగా అభివర్ణించారు. పాలకులు కుట్ర పూరితంగా రవికుమార్‌ని అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. సామాజిక వర్గ సమస్యలపై స్పందిస్తూ.. అందరికీ పెద్ద దిక్కుగా ఉంటున్న కొరికాన రవికుమార్‌ వంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తూర్పు కాపు బిడ్డపై ఉందని పిలుపునిచ్చారు. ఆయన మార్గదర్శకత్వంలోనే భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో జిల్లావ్యాప్తంగా ఈ ఐక్యతను మరింత బలోపేతం చేసి, సామాజికంగా, రాజకీయంగా తమ వాటాను దక్కించుకుంటామని తీర్మానించారు. సమావేశంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, లుకలాపు సంతోష్‌ చక్రవర్తి, వాడవలస సురేష్‌కుమార్‌, అన్నెపు రామకృష్ణ, డోల జగన్‌, శాసపు జోగినాయుడు, పతివాడ గిరీశ్వరరావు, మిర్తివాడ ప్రభాకర్‌, రాజు, గిరడ అప్పలస్వామి, తాట్రాజుల రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement