సచివాలయాల తనిఖీల్లో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

సచివాలయాల తనిఖీల్లో అలసత్వం వద్దు

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, క్షేత్రస్థాయి తనిఖీల్లో ఏమాత్రం అలసత్వం వహించరాదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ దొనక పృథ్వీరాజ్‌ కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావులతో కలిసి ఆయన వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలకు సంబంధించి కలెక్టర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అధికారి తమకు కేటాయించిన సచివాలయాలను క్రమం తప్పకుండా సందర్శించి, సేవలందిస్తున్న తీరును పరిశీలించాలన్నారు. రిజిస్టర్ల నిర్వహణ, బయోమెట్రిక్‌ హాజరు, ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలని స్పష్టం చేశారు. తనిఖీల నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు.

జన గణనపై దిశా నిర్దేశం

రానున్న జన గణన ప్రక్రియపై కలెక్టర్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గణన కోసం నియమించిన సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో ఎక్కడా తప్పులు దొర్లకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు. రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో మ్యుటేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూముల సవరణలు, వెబ్‌ల్యాండ్‌లో మార్పులపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను వసూళ్లను శతశాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. నీటి తీరువా వసూళ్లలో పురోగతి సాధించాలని, రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సకాలంలో జమ చేయాలని సూచించారు. ఇందులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement