శ్రీకాకుళం: జిల్లా పరిషత్ పరిధిలోని ఉన్నత పాఠశాలలు, పంచాయతీ రాజ్ కార్యాలయాల్లో రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పలువురికి జూనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పిస్తూ నియామక పత్రాలను జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ మంగళవారం అందజేశారు. మురపాక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న రమాదేవిని శ్రీకూర్మం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పిల్లలవలస జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న ఎ.రాజేశ్వరిని రాజాం మండల పరిషత్‌లో, బాసురు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సీహెచ్ తవిటినాయుడును రాజాం మండల పరిషత్ కార్యాలయంలో, దేవుదల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పనిచేస్తున్న వీవీ రమణను లింగాలవలస జెడ్పీ హైస్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతిపై నియమించారు. అలాగే కింతలి జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న ఎస్.పార్వతిని శ్రీకాకుళంలోని జెడ్పీ హైస్కూల్లో నియమిస్తూ నియామకపత్రాలను పదోన్నతులు పొందినవారికి అందజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పదోన్నతి పొందిన ఉద్యోగులు కష్టపడి పనిచేసి, జిల్లా పరిషత్ యాజమాన్యానికి మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఈవో డి.సత్యనారాయణ, ఏవో రాజేశ్వరరావు పాల్గొన్నారు.


