● ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్
శ్రీకాకుళం: సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన పీ–4 కార్యక్రమంతో పేదరికం నిర్మూలన సాధ్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో పీ–4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మార్గదర్శుల సత్కార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని సంపన్న పౌరులు మార్గదర్శులుగా అత్యంత పేదరికంలో ఉన్న 20 శాతం బంగారు కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం ఒక గొప్ప సామాజిక బాధ్యత అని కొనియాడారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 8,760 మంది మార్గదర్శులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, డీఆర్‌వో విశ్వేశ్వరరావు, ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మీప్రసన్న, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీధర్, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈవోగా వెంకట్రామన్
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈవోగా వెంకట్రామన్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ ఇన్‌చార్జి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు డిప్యూటీ సీఈవోగా శ్రీకాకుళంలో పనిచేస్తూ ఇన్‌చార్జి సీఈవోగా వ్యవహరించారు. శ్రీకాకుళం నుంచి విజయనగరం కొద్దిరోజుల క్రితం బదిలీ అవ్వగా, తాజాగా ఆయనకు సీఈవోగా పదోన్నతి కల్పిస్తూ శ్రీకాకుళంలో నియమించారు. గతంలో ఈయన శ్రీకాకుళం ఎంపీడీవోగా కూడా పనిచేశారు. మంగళవారం ఈయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.


