పాతపట్నం: ఆకలి తీర్చడానికి చనుబాలు లేవు.. ఏడుపు ఆపడానికి తల్లి పొత్తిళ్లు లేవు.. ఒంటి నిండా చీమల కాట్లు.. కంటి నిండా కన్నీటి బొట్లు. వారం వయసున్న పిల్లాడు పొదల మధ్య పడిన అవస్థ ఇది. పాతపట్నం మండలంలోని బూరగాం గ్రామంలోని సత్యనారాయణ ఆలయం పక్కన ఘంసీ పుల్లాయ్ ఇంటి పెరటిలో సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎవరో పసి కందును పడేసి వెళ్లిపోయారు. ఆ పసికందు గుక్కపట్టి ఏడవడంతో భూదేవి అనే మహిళ బాబును రక్షించి, గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో బాబుకు సపర్యలు చేసి, శరీరాన్ని శుభ్రం చేశారు. బాబుకు వైద్య సేవల కోసం మంగళవారం ఉదయం తీసుకువెళతామన్నారు. ప్రస్తుతం బాబు ను భూదేవి అనే మహిళ వద్ద గ్రామస్తులు ఉంచారు.


