సిక్కోలు.. కొత్త లెక్కలు | - | Sakshi
Sakshi News home page

సిక్కోలు.. కొత్త లెక్కలు

Mar 25 2026 6:52 AM | Updated on Mar 25 2026 6:52 AM

1.60లక్షల జనాభా ప్రాతిపదికనైతే..

రాజకీయానికి

కొత్త రెక్కలు

హస్తిన నుంచి చల్లని కబురు వచ్చింది. జిల్లా రాజకీయం ఉప్పొంగింది. ఇన్నాళ్లూ గుండెల్లో పెట్టుకున్నా ఆశలు రెక్కలు తొడుక్కొని వ్యూహాలోకాల్లో విహరిస్తున్నాయి. పునర్విభన జరిగితే నియోజకవర్గాలు పెరిగి కొత్తకొత్త పదవులు పుట్టుకొచ్చి రాజకీయ నిరుద్యోగం తీరుతుందని ఆశ.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

నియోజకవర్గాల పునర్విభజన ప్రకటన జిల్లాలో రాజకీయ వేడి రగిలించింది. ఈ ప్రకటన రాజకీయ ఆశావహులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. పునర్విభజన జరిగితే జిల్లా ముఖ చిత్రంతో పాటు రాజకీయ స్వరూపం మారుతుంది. ప్రస్తుతం ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా మరో ఆరు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకో లోక్‌సభ నియోజకవర్గం కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏ నియోజకవర్గాలు ఏర్పడతాయి? వాటిలోకి ఏ మండలాలు వస్తాయి? అన్నదానిపై చర్చలు ప్రారంభమయ్యాయి.

సర్వత్రా ఇదే చర్చ..

2004లో 12 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. కానీ 2009 పునర్విభజన అయ్యాక 10 అసెంబ్లీ స్థానాలకు పడిపోయాయి. ఉణుకూరు, హరిశ్చంద్రపురం నియోజకవర్గాలు రద్దయ్యాయి. ఉమ్మడి జిల్లాలో కూడా 10 అసెంబ్లీ స్థానాలుండేవి. జిల్లాల పునర్విభజన తర్వాత శ్రీకాకుళం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్‌సభకు పరిమితమైంది. త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో గణనీయంగా అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. దీంతో జిల్లా చరిత్రలో అత్యధిక నియోజకవర్గాలుగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న నియోజకవర్గాలు మారుతాయా? ఉన్న మండలాలు పోతాయా? కొత్త మండలాలు వస్తాయా? ఇలా రకరకాల ఊహాగానాలకు తెరలేచింది.

ఆశల పల్లకిలో ఆశావహులు..

జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ నాయకులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్తగా మరికొంత మంది పోటీ చేసే అవకాశం రానుండడంతో గంపెడాశలు పెట్టుకున్నారు. చాలా మంది నాయకులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. ఇంతవరకు పరిమిత స్థానాలు కావడం, నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు వచ్చేసరికి కొందరినే సీట్లు వరిస్తున్న పరిస్థితి నెలకొంది. మిగతా వారికి నిరాశే ఎదురవుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ పోటీ ఎక్కువగా ఉంది. సీట్ల కోసం పోటీ పడటమే కాదు ఎంతైనా ఖర్చు పెట్టాలన్న ఉత్సుకతతో సీటు ఇస్తే మా తడాఖా చూపిస్తాం, అవసరమైతే ఎంతవరకై నా ఖర్చు పెడతామనే నాయకులు ఉన్నారు. అలాంటి వారందరికీ నియోజకవర్గాల పునర్విభజన మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

● ప్రస్తుతం ఉన్న లోక్‌సభతో పాటు మరో లోక్‌సభ

స్థానం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.

● ఈ లెక్కన మన జిల్లాలో కొత్తగా ఆరు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

పునర్విభజన ప్రక్రియ జరిగితే మారనున్న జిల్లా ముఖచిత్రం

రాజకీయ లెక్కలూ మారే అవకాశం

ఔత్సాహిక ఆశావహుల్లో ఆనందం

జనాభా లెక్కల ప్రకారం కొత్తగా ఆరు అసెంబ్లీలు ఏర్పాటయ్యే అవకాశం

మరో లోక్‌సభ వచ్చే ఛాన్స్‌!

జరిగితే ఇలా..!

తాజాగా చేపడతామంటున్న పునర్విభజన ప్రక్రియతో కొత్తగా సుమారు ఆరు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 14కి, రెండు లోక్‌సభ స్థానాలకు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ముందు ఇలా..

జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ స్థానాలు ఉండేవి. జిల్లాలో ప్రస్తుతం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక లోక్‌సభ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement