నీరున్నా.. కన్నీరేనా..? | - | Sakshi
Sakshi News home page

నీరున్నా.. కన్నీరేనా..?

Mar 25 2026 6:52 AM | Updated on Mar 25 2026 6:52 AM

వంశధార కాలువలకు నీరు నిలిపివేత

బ్యారేజీ పనుల పేరుతో వృథాగా కిందకు..

పోలీస్‌ పహారాతో నీటిని దిగువకు విడుదల

అన్నదాతలకు అపార నష్టం

తీరని అన్యాయం..

రైతులకు వంశధార అధికారులు తీరని అన్యాయం చేశారు. కనీసం బ్యారేజీ పనులు అని ముందుగా చెప్పి ఉంటే పంటల సాగును స్వచ్ఛందంగా నిలిపివేసేవాళ్లం. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రైతులు నష్టాల్లో కూరుకుపోయేలా చేశారు.

– మీసాల బాస్కరరావు, రైతు, భగీరథిపురం

చాలా ఘోరం

ఇంతకంటే ఘోరం ఉంటుందా? రైతుల విషయంలో మరీ ఇంత నిర్లక్ష్యం తగునా? ముందుగా చెప్పి ఉంటే పంటల సాగు చేయకుండా ఉండేవాళ్లం కదా. రైతులకు కన్నీళ్లు మిగిల్చారు.

– కరణం శివరాం, రైతు, పిండ్రువాడ

హిరమండలం: ‘వంశధార ప్రాజెక్టు నిర్మాణ పనులు 2026 ఫిబ్రవరికి పూర్తిచేస్తాం. రబీలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వేరు శనగ, ఇతర పంటలను వేసుకోవాలి. వరికి నీరు ఇచ్చే ఆస్కారమే లేదు. మాట వినకుండా వరి వేసి సాగునీరు అందించలేద ని చెప్పి మమ్మల్ని నిందించకండి. వరి తప్ప ఇతర పంటలు వేసుకోండి’.. గత ఏడాది డిసెంబరు 6న శ్రీకాకుళం జెడ్పీ మందిరంలో జిల్లా నీటిపారుదల సలహా మండలిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన ప్రకటన ఇది..

వంశధార పరిధిలో రైతులు రబీకి వేరు శనగ, నువ్వు, మొక్కజొన్న, ఇతర కూరగాయలను సాగుచేశారు. కర్బూజా వంటి పంటలను కూడా వేసుకున్నారు. పెట్టుబడులు పెట్టాక, దిగుబడులు వస్తాయ న్న సమయంలో గొట్టా బ్యారేజీ మరమ్మతుల పేరిట నీటిని కిందకు వదిలేస్తున్నారు. కనీసం రైతుకు ఒక మాటైనా చెప్పకుండా నీటిని వదిలేయడంతో రబీ పంటలు వేసుకున్న వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎడమ, కుడి కాలువ పరిధిలో నీటి సరఫరాను నిలిపివేశారు. బ్యారేజీలో స్థిరీకరించిన నీటిని కిందకు వృధాగా విడిచిపెట్టేశారు. దీంతో కాలువల పరిధిలో రబీ పంటలు వేసుకున్న రైతులు రెండు సార్లు ఆందోళనకు దిగారు. మంగళవారం మరోసారి ఆందోళనకు దిగే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మూడు నెలల కిందట జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఓ సలహా ఇచ్చి ఉన్నా పంటలు వేసుకునే వాళ్లం కాదని, ఇప్పుడు డబ్బు, కష్టం రెండూ వృథా అయ్యాయని వాపోతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో రబీ సాగు లక్ష్యం 70,319 హెక్టార్లు. అయితే ఇందులో సింహభాగం వంశధార కాలువల పరిధిలో పాతపట్నం, నరసన్నపేట, ఆమదాలవలస నియోజకవర్గాల్లోనే ఎక్కువగా పండిస్తారు. అధికారుల సూచనలతోనే ఈ ఏడాది వరి వేయలేదు. ఇప్పుడు వేసిన పంటలకు కూడా నీరివ్వకుండా వేధిస్తున్నారు. ముందుగా చెప్పకుండా ఉన్నట్టుండి నీరు ఆపేయడంతో పెట్టుబడులను రైతులు నష్టపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement