కంచిలి: కంచిలిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయస్థాయి పెయింటింగ్ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబర్చారు. డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ ఫైన్ ఆర్ట్స్ ఫౌండేషన్ ట్రస్ట్, విజయవాడ వారి 13వ ఆల్ ఇండియా యూత్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ కాంపిటీషన్ కం ఎగ్జిబిషన్ ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఇందులో 25 మంది విద్యార్థులు స్వర్ణ పతకాలు, సర్టిఫికెట్లు, ఇద్దరు విద్యార్థులకు వెండి పతకాలు, 35 మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు లభించాయి. చిత్రలేఖనంలో తర్ఫీదునిచ్చిన ఆర్ట్స్ ఉపాధ్యాయుడు దిక్కల మన్మథరావుకు అవార్డు లభించింది. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్ ఎన్.వి.రమణయ్య, ఉపాధ్యాయులు అభినందించారు.


