శ్రీకాకుళం పాతబస్టాండ్: పాతపట్నంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో 7వ తరగతి విద్యార్థిని పూజ మృతి చెందిన ఘటనపై దళిత సంఘాల జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ ఘటనపై నిష్పక్షపాతంగా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి కనీసం రూ.15 లక్షల పరిహారం ప్రకటించాలని కోరారు. స్కూల్ వెనుక భాగంలో ఉన్న ప్రహరీ చాలా రోజు ల కిందటే కూలిపోయినా పునర్నిర్మాణం జరగలేదని, ఆ ప్రాంతానికి సమీపంలో రైల్వే ట్రాక్ ఉండటం వల్ల విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న గోడ నిర్మాణం కూడా నాణ్యత లేనిదిగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కోఆర్డినేటర్‌గా ఉన్న అధికారి పై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.


