అవగాహన కల్పిస్తున్నాం
● వరి కొయ్య దహనంతో తగ్గుతున్న భూసారం
హిరమండలం: కొన్నేళ్ల కిందట వరి కోతల అనంతరం గడ్డిని కుప్పలుగా వేసి పశువుల మేతకు ఉపయోగించేవారు. ప్రస్తుతం కూలీల కొరత ఏర్పడుతుండడంతో రైతులు కోతలకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. కోతలు పూర్తయ్యాక మిగిలిన కొయ్యలతో పాటు మిగిలిన గడ్డిని రైతులు పొలంలోనే నిప్పంటిస్తున్నారు. అవగాహన లోపంతో అన్నదాతలు ఇలా చేస్తే ఇలాంటి తప్పిదాలతో భూసారానికి ముప్పు పొంచి ఉందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడంతో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాదని చెబుతున్నారు. పంటలకు కీడు చేసే పురుగులను తినే వానపాములు, కీటకాలు నశించే ప్రమాదం ఉంది. అలాగే భూమికి సేంద్రియ పీచు పదార్థాలుగా ఉప యోగపడే అవశేషాలు ఖనిజ, లవణాలు నశిస్తా యి. అలాగే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.
ఇలా చేస్తే మేలు..
పంటల సాగులో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. పంటకోత పూర్తయిన తర్వాత మిగిలిన పంటల అవశేషాలను భూమిలో మురగబెట్టి దుక్కిలో కలిపిదున్నాలి. ఇలా చేయడంతో వరి గడ్డి భూమిలో మురిగి సేంద్రీయ కర్బనం పెరుగుతుంది. ఇది తరువాత సాగుచేసే పంటకు మేలు చేకూరుతుంది. యూరియా, సూపర్ పాస్పేట్, పొటాష్‌లను కలిపి పంట సాగు చేసుకొనే ముందు చల్లితే పొలంలో మిగిలిన కొయ్యలు, వరి గడ్డి రెండు వారాల్లోనే మురుగుతాయి.
పంట భూముల్లో గడ్డి, వరి కొయ్యలను దహనం చేస్తే భూ సారాన్ని కోల్పోతుంది. అవసరం లేని గడ్డిని భూమిలోనే కలిపి దున్నితే సేంద్రీయ ఎరువుగా మారి భూమికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. గడ్డి, కొయ్యల దహనంతో వాతావరణం కాలుష్యం అవుతుంది. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– బి.సంధ్య, మండల వ్యవసాయాధికారి, హిరమండలం


