కంచిలి: పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంటిని విషాదం కమ్మేసింది. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన వరుడి తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయా రు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్లగా.. కంచిలి మండలం ఆర వ సరియాపల్లి గ్రామానికి చెందిన బుడ్డెపు కమలా కుమారి(50) ఆశ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆమె భర్త సాధారణ రైతు కూలి. వీరికి కుమారుడు దినేష్‌రెడ్డితో పాటు కుమార్తె ఉంది. కుమార్తెకు వివాహమై అత్తవారింట్లో ఉంటుంది. ఇటీవల కుమారునికి వివాహం నిశ్చయమైంది. 12వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో జాడుపూడి గ్రామంలోని వారి బంధువులందరికీ శుభ లేఖలు ఇవ్వడానికి ఆమె వెళ్లారు. శుభలేఖలు పంచడం పూర్తిచేసుకొని సాయంత్రానికి ఇంటికి రావడానికి జాడుపూడి వద్ద బస్సు ఎక్కి అంపురం కూడలి వద్ద దిగా రు. తన స్వగ్రామం వెళ్లేందుకు జాతీయ రహదారిని దాటుతుండగా పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆశ కార్యకర్త ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున ట్లు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన యువ క్రికెటర్ నంబళ్ల సుశాంత్ ఈ ఏడాది కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత ఏడాది సెంచరీల వర్షం కురిపించగా.. ఈ సీజన్‌లోనూ అదే జోరును కనబరుస్తున్నాడు. తాజాగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో జరుగుతున్న ఏసీఏ అంతర్‌జిల్లాల అండర్–23 పురుషుల వన్డే క్రికెట్ టోర్నీలో సిక్కోలు యువ ఓపెనర్ 125 బంతుల్లో 10 బౌండరీలు, 8 భారీ సిక్సర్లతో 126 పరుగులు సాధించి జిల్లా జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. సుశాంత్‌కు ఎం.రోహిత్‌కుమార్ 63 పరుగల అర్ధసెంచరీతో సహకరించడంతో శ్రీకాకుళం జిల్లా జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. జిల్లా ఆటగాళ్లు రాణింపుపై కోచ్‌లు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.


