హిరమండలం: పాతపట్నం నియోజకవర్గానికి చెందిన బాలిక హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇంటర్‌లో చేర్పిస్తానంటూ చెప్పి లైంగిక దాడి చేసి చంపేసిన విషయం విధితమే. ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ స్పందించారు. తక్షణం ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో సంబంధిత ప్రతినిధి బృందం డాక్టర్ నాగమానస, గంగు సూర్యనారాయణ, చల్లా మధుసూదనరావు బాధిత కు టుంబాన్ని పరామర్శించారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారితో పాటు జిల్లా బాలల రక్షణ అధికారి కేవీ రమణ, ఐసీడీఎస్ పీఓ మల్లేశ్వరరావు, సీడీపీఓ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం కల్చరల్: భారత సాంస్కృతిక, సహకార, స్నేహ సంఘం (ఇస్కఫ్) రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఈనెల 4న శనివారం ఉదయం కొత్త రోడ్ జంక్షన్‌లో గల హనుమాన్ ఫంక్షన్ హాల్‌లో జరుగుతుందని ఆహ్వాన సంఘం అధ్యక్షులు గేదెల ఇందిరా ప్రసాద్, జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామమూర్తి, అధ్యక్షులు బీవీఎస్‌ఎన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. యుద్ధాలు– మానవాళి–పర్యావరణం అనే అంశంపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రతినిధులతో చర్చ జరుగుతుందని తెలిపారు.
పాతపట్నం: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పాతపట్నంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఎస్‌ఐ కె.మధుసూధనరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సరిహద్దు ప్రాంతంలో ప్రయాణించే వాహన చోదకులు తప్పనిసరిగా వాహన పేపర్లు, లైసెన్స్ తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు. ఈ చలానా పెండింగ్‌లు ఉంటే వెంటనే కట్టాలన్నారు. ఒడిశా నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. తనిఖీల్లో ఏఎస్‌ఐ కె.శ్రీరాములు, కానిస్టేబుల్‌లు పాల్గొన్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా మరో మెగా చెస్ టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. శ్రీకాకుళం జిల్లా చెస్ అసోసియేషన్, సీఎస్‌ఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 14 నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. అదే విధంగా ఆ టోర్నీ ముగిసిన తర్వాత జూలై 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మరో ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ శ్రీకాకుళం గ్రాండ్ కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన క్రీడాకారులకు రూ.10 లక్షలు నగదు బహుమతితో పాటు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ సర్టిఫికెట్లను సైతం అందజేయనున్నట్టు టోర్నమెంట్ డైరెక్టర్, రాష్ట్ర చెస్ ఇన్ స్కూల్స్ కన్వీనర్, సనపల భీమారావు తెలిపారు. ఈ టోర్నమెంట్లలో దేశంలో అనేక రా ష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో పాటు ఇతర దేశాల క్రీడాకారులు కూడా పాల్గొననున్నారని, ఈ టోర్నమెంట్ నిర్వహణ శ్రీకాకుళం జిల్లాకు ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ మెగా చెస్ టోర్నీలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, పారిశ్రామికవేత్త లు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహకరించాలని చెస్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని ఆర్గనైజషన్ కమిటీ ప్రెసిడెంట్ తంగుడు సుధీర్ తెలిపారు.
నందిగాం: పోలవరానికి చెందిన కె.లచ్చయ్యపై శుక్రవారం తేనెటీగల దాడి చేసి గా యపరిచాయి. వివరాలు పరిశీలిస్తే లచ్చయ్య (60) తనకు గల మేకలకు గ్రామానికి సమీపంలో ఉన్న మెట్ట దగ్గరకు మేపుటకు తీసుకువెళ్లాడు. అయితే అక్కడ ఒక్కసారిగా తేనె టీగలు దాడి చేయడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. భోజనం వేళయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. అపస్మారక స్థితిలో లచ్చయ్య కనిపించాడు. దీంతో 108 వాహనానికి సమాచారం అందించారు. అందులో ప్రథమ చికిత్స చేసి టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.


