‘‘మహిళల జోలికి వస్తే తాట తీస్తాం.. ఆడపడుచులను కష్టపెడితే అంతు చూస్తాం.. అతివలను అగౌరవపరిస్తే అక్కడికక్కడే శిక్షిస్తాం’’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకప్పుడు ఆవేశంతో ఊగిపోయారు. స్త్రీల ధన..మాన.. ప్రాణాల రక్షణకే అధిక ప్రాధాన్యమిస్తామని ఊదరగొట్టారు. అయితే ఆదర్శాలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమని నిరూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగినప్పటికీ చేతులు ముడుచుకుని కూర్చున్నారు. కూటమి నేతలు బరితెగించి మహిళలపై దాడులకు పాల్పడుతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం రైల్వేకోడూరులో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి తాతంశెట్టి నాగేంద్ర జంకుగొంకు లేకుండా నడిరోడ్డుపైనే ఓ మహిళను విచక్షణారహితంగా కొట్టినా కనీస మాత్రం కూడా స్పందించకుండా కాలయాపన చేస్తున్నారు.
తిరుపతి జిల్లా: మహిళల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ కల్యాణ .. తమ జనసేన పార్టీ నాయకులే ఓ మహిళపై నడి రోడ్డుపై దాడిచేస్తే పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నస్తున్నారు. సినిమాలో చెప్పినట్టు సభల్లో డైలాగులు చెప్పడం తప్ప తన సొంత పార్టీకి చెందిన నేతలు ఏం చేసినా ఆయనకు పట్టదా అని మండిపడుతున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గ కేంద్రంలో పట్టపగలు నడిరోడ్డున జనసేన పార్టీ నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర దళిత మహిళపై పోలీసుల సమక్షంలో.. పోలీసు లాఠీతో దాడిచేశారు. దుర్భాషలాడి వీధి రౌడీలా ప్రవర్తించారు.
ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తమ పార్టీ నాయకులే మహిళల పట్ల బరితెగించి ప్రవర్తిస్తుంటే నోరు మెదపడం లేదని స్థానిక మహిళలు ప్రశి్నస్తున్నారు. మొన్న రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సచివాలయ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడి మోసగించాడని జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తే కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తప్పు చేశాడని అన్ని ఆధారాలున్నా డిప్యూటీ సీఎం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజల ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారని.. అయితే పార్టీ అధికారిక కార్యక్రమాల్లో అతను పార్టీ కండువా వేసుకుని వేదికపై ఆశీనుడవుతున్నా పవన్ కల్యాణ్‌కు తెలియదా అని నిలదీస్తున్నారు.
ప్రజాస్వామ్యానికి తూట్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయని, పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఏం చేసినా.. పోలీసులు చూస్తూ ఏమీ చేయక సలాములు కొడుతున్నారని మండిపడుతున్నారు. రైల్వేకోడూరు నడి»ొడ్డున దళిత మహిళపై పోలీసుల సమక్షంలో తాతంశెట్టి నాగేంద్ర దాడిచేస్తే అతనిని అడ్డుకుని చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమంటున్నారు. బాధితురాలు రోడ్డుపై నిరసనకు దిగితే స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సలహాలు ఇచ్చారని దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసులు రాజకీయ నాయకులకు రక్షకులుగా ఉన్నారు తప్ప ప్రజలకు రక్షకులు కాదా అని ప్రశ్నిస్తున్నారు.
సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలి
రైల్వేకోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారానికి పాల్పడడంతోపాటు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక ప్రభుత్వ ఉద్యోగిని జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని.. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. నియోజకవర్గ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా?
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దళిత మహిళపై పోలీసుల లాఠీ తీసుకుని కొట్టడం అమానుషం. నిస్సహాయురాలిగా ఉన్న మహిళను కొట్టడం ఏమిటి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్న సందేహం తలెత్తుతోంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం ఉన్నా దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి.
– ఇసుకపాటి లక్ష్మీనారాయణమ్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, రైల్వే కోడూరు
ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు
రైల్వేకోడూరు పట్టణం నడి»ొడ్డున ఓ దళిత మహిళపై జనసేన పార్టీ నాయకులు కర్రలతో దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో తీవ్రంగా విఫలం అయింది. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. ఈ విషయంపై సీపీఐ తరఫున పోరాటాలు చేస్తాం. కనీసం పోలీసులు కూడా పట్టించుకోకపోవడం దారుణం.
– చింతలపూడి నాగమ్మ, సీపీఐ మండల కార్యదర్శి, ఓబులవారిపల్లె


