ఇచ్ఛాపురం రూరల్: ఒడిశా అధికారు లు తమ ప్రాంతంలో సర్వే రాళ్లు పాతుతూ, ఇక్కడి భూములను ఆక్రమించుకుంటారన్న ఆందోళన అక్కర్లేదని, మీకు అండగా అధికారులు, ప్రభుత్వం ఉంటుందని తహసీల్దార్ ఎన్.వెంకటరావు, సీఐ ఎం.చిన్నంనాయుడు పెద్ద లక్ష్మీపురం గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఒడిశా సున్నాపురం వద్ద ఒడిశా ప్రభుత్వం నిర్మిస్తున్న 150 టన్నుల కార్గో పోర్ట్ ప్రాజెక్ట్ కోసం ఇటీవల ఒడిశా అధికారులు సర్వే నిర్వహించారని, ఆంధ్రా ప్రాంతంలో ఉన్న పెద్ద లక్ష్మీపురం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. దీనిపై మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘హద్దులు దాటిన సర్వే’ కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం అధికారులు పెద్ద లక్ష్మీపురం గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. ప్రస్తుతం ఒడిశా అధికారులు ఆంధ్రా ప్రాంతంలో పాతిన సర్వే రాళ్లు టెంపరరీ మాత్రమేనని, ఆంధ్రా ప్రాంతంలో ఉన్న భూములు ఒడిశాలో నిర్మితమవుతున్న పోర్ట్ ప్రాజెక్ట్‌కు ఎలాంటి పరిస్థితిలో ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఎవరైనా ఇతర వ్యక్తులు సర్వేలు పేరిట గ్రామంలో హడావుడి చేస్తే వెంటనే తమకు సమాచారం అందజేయాలని సీఐ ఎం.చిన్నంనాయుడు సూచించారు.


