● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● పీజీఆర్‌ఎస్‌కు 116 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)ను సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా మొత్తం 116 వినతులు అందాయి. వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 28 అర్జీలు రాగా, సెర్ప్ విభాగంలో 26, పంచాయతీ రాజ్ శాఖకు 14, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 10 వినతులు అందాయి. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ డెస్క్‌లను కలెక్టర్ సందర్శించారు. మండలాల వారీగా ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ, ప్రజలు సమర్పించిన భూ సంబంధిత సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేరుగా దరఖాస్తుదారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
● గార మండలంలోని అంపోలు పంచాయతీ ఆడవరం గ్రామానికి చెందిన గుజ్జుల పైడియ్య, రెల్ల రామారావు, పెడాడ వినోద్, ఎం.సురేష్ కుమార్‌లు తమ గ్రామంలో డాబా ఇళ్లపై విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని, దీంతో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. కలెక్టర్‌ని కలిసినవారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు రౌతు శంకరరావు, అసెంబ్లీ గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు ఎస్.సత్యనారాయణ ఉన్నారు.
● ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని మాతల చిట్టిబాబు అనే వ్యక్తి కబ్జాచేసి గోడ నిర్మాణం చేశారని, అడిగితే బెదిరిస్తున్నారని దివ్యాంగురాలైన మైలపిల్లి ఆదిలక్ష్మి సోమవారం ఫిర్యాదు చేసింది. గోడను తొలగించి, తన భూమిని ఇప్పించాని, రక్షణ కల్పించాలని కోరారు.
దళిత పారిశ్రామికవేత్తలను బతకనివ్వండి
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కోసం మంజూరు చేసిన రుణాలను బలవంతంగా వసూలు చేయాలని కూటమి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో, అదే అదునుగా ఎస్సీ రుణగ్రస్తులపై అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని, దీనిని ఆపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి తదితరులు కోరారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు.
రుణాలు తీసుకున్న దళిత పారిశ్రామికవేత్తలు ఇప్పటికే భారీ నష్టాలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రికవరీ చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దారుణమన్నారు. ఉన్నట్టుండి రుణాలన్నీ కట్టాలంటే సాధ్యంకాదని ప్రభుత్వానికి తెలిసినప్పటికీ.. కావాలనే దళిత పారిశ్రామికవేత్తలను ఇబ్బందులకు గురిచేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తక్షణమే రికవరీ నిలుపుదల చేయాని కోరారు. అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్పొరేషన్ ద్వారా రుణాలను త్వరగా మంజూరు చేయాలని విన్నవించారు. కలెక్టర్‌ని కలిసినవారిలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుజ్జుల యోగేశ్వరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెయ్యల లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలాపు ముకుందరావు, దళిత యువజన నాయకుడు ఆట్ల రాహుల్ కుమార్ తదితరులు ఉన్నారు.


