అందని వేతనం..!
దక్కని గౌరవం..
● ఎంపీటీసీలకు అందని గౌరవ వేతనం
● ప్రజాప్రతినిధులను కార్యక్రమాలకు ఆహ్వానించని అధికారులు
● ఉమ్మడి జిల్లాలో 728 మంది సభ్యులు
ఇచ్ఛాపురం రూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా వారి సహనాన్ని పరీక్షిస్తోంది. వాస్తవంగా ఎంపీటీసీ సభ్యులకు ప్రతినెలా గౌరవ వేతనంగా రూ.3 వేలు ఇవ్వాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండు విడతలుగా ఎంపీటీసీల గౌరవ వేతనం చెల్లించింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా పాలన చివరిలో ఎంపీటీసీల వేతనం చెల్లించలేకపోయింది. అయితే 2024 జూన్‌లో కొత్తగా కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అప్పటినుంచి కూటమి ప్రభుత్వం ఎంపీటీసీల వేతనాలు విడుదల చేయలేదు. ప్రతి సభ్యుడికీ 29 నెలల గౌరవ వేతనం సుమారు రూ.87 వేలు ప్రభుత్వం బకాయి పడింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీలు అధిక సంఖ్యలో ఉండడం వల్లే కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న సాధారణ సర్వసభ్య సమావేశాల్లో ప్రాదేశిక సభ్యులు తమ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 728 మంది ఎంపీటీసీలు గౌరవ వేతనం కోసం ఎదురుచూస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రజాప్రతినిధులకు ఆహ్వానం ఉండడం లేదు. ఎటువంటి అర్హత లేని, కనీసం వార్డు మెంబర్ హోదా లేని కూటమి నేతలు పాల్గొని అధికారం చెలాయిస్తున్నారు. ఇదే విషయంపై మండల ప్రాదేశిక సభ్యులు మండల స్థాయి సమావేశాల్లో అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.
మంజూరు చేయాలి
ఎంపీటీసీల గౌరవ వేతనాలు ప్రభుత్వం విడుదల చేయాలి. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీ టీసీలు ఎక్కువ మంది ఉండడంతో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఎంపీటీసీల పదవీ కాలం త్వరలో ముగియనున్నా ఇంకా గౌరవ వేతనాలు విడుదల చేయడం లేదు. వెంటనే వేతన బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలి.
– ఆశి మంథాకిని, ఎంపీటీసీ, లొద్దపుట్టి–2,
ఇచ్ఛాపురం మండలం
నిర్లక్ష్యం సరికాదు
మండల, గ్రామస్థాయిలో అభివృద్ధి, ప్రణాళిక, ప్రారంభోత్సవాల కార్యక్రమాలకు ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లను ఆహ్వానించడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. జాతీయ పండగలు, జాతీయ నాయకులకు చెందిన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు లేకుండా నిర్వహిస్తున్నారు. ఇదేం పద్ధతి అంటూ నిలదీస్తుంటే.. స్థానిక ఎమ్మెల్యే ఒప్పుకోవడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా వారి తీరు మారాలి. – దున్న గురుమూర్తి,
వైస్ ఎంపీపీ, ఇచ్ఛాపురం మండలం
అందని వేతనం..!
అందని వేతనం..!


