కిరాక్ ఆర్పీ వ్యాఖ్యలు సరికాదు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మాజీమంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణపై జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు సరికాదని తూర్పు కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండాల గణేష్ అన్నారు. స్థానిక ఇందిరానగర్‌లోని తూర్పుకాపు సంక్షేమ సంఘం భవనంలో విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర లెజెండ్ అయినటువంటి బొత్సపై కామెంట్స్ చేసే స్థాయి కిరాక్ ఆర్పీకి లేదని మండిపడ్డారు. అతడి లాంటి వ్యక్తుల వలన సమాజానికి కీడు ఎక్కువగా జరుగుతుందని ఆరోపించారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సమావేశంలో సంఘ గౌరవాధ్యక్షుడు ఇజ్జాడ శివన్నారాయణ, కరణం శ్రీనివాసరావు, యువజన కార్యదర్శి జొన్న రాజు, టౌన్ కార్యదర్శి డోల నాగరాజు, నగర అధ్యక్షుడు హారిక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బూర్జ: వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను అవహేళన చేస్తూ విమర్శించడం తగదని మండలంలోని తోటవాడ గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు అన్నారు. ఈ మేరకు టీడీపీ సోషల్ మీడియా స్టేజ్ ఆర్టిస్ట్ కిర్రాక్ ఆర్‌పీ(రాటకొండ ప్రసాద్)పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల నాయకులతో కలిసి బుధవారం బూర్జ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న బొత్స సత్యనారాయణ పట్ల వ్యంగ్యంగా, అనుచితంగా, అవహేళన చేస్తూ పరువుకు భంగం కలిగించినందుకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈయనతో పాటు జెడ్పీటీసీ సభ్యుడు బెజ్జిపురం రామారావు, మండల పరిషత్ ప్రత్యేకాహ్వానితుడు కర్నేన నాగేశ్వరరావు, జిల్లా టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జల్లు బలరాంనాయుడు, మండల యువజన విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీనివాసరావు, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మామిడి కిరణ్‌కుమార్, వలంటీర్ విభాగం అధ్యక్షుడు ఇప్పిలి తిరుపతిరావు, మండల కార్యదర్శి కొంచాడ వెంకటరమణ, నాయకులు మజ్జి నర్సింగరావు పాల్గొన్నారు.
కిరాక్ ఆర్పీ వ్యాఖ్యలు సరికాదు


