ప్రారంభమైన డోలోత్సవ పూజలు
కవిటి: మండలంలోని బెజ్జిపుట్టుగలో వెలసిన చక్రధర పెరుమాళ్ స్వామి ఆలయంలో బుధవారం డోలోత్సవ వేడుకలకు సంబంధించి తొలిరోజు పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే శ్రీదేవీ, భూదేవీ ససమేత చక్రధర పెరుమాళ్ స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తొలిరోజు పొందల శ్రీరాంబాబు దంపతుల సౌజన్యంతో స్వామివారికి అభిషేకం, అర్చన సేవలను నిర్వహించారు. సాయంత్రం మంధా నాగమణి భాగవతారిణిచే హరికథా గానం చేపట్టారు.
వైన్‌షాపులో నగదు చోరీ
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో మెడికవర్ ఆస్పత్రి సమీపంలోని ఒక వైన్‌షాపులో గుర్తు తెలియని అగంతకులిద్దరు రూ.2 లక్షల నగదు దొంగిలించారు. రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మీసాల రామారావుకు చెందిన వైన్‌షాపులోకి మంగళవారం రాత్రి 2.15 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు షట్టర్ లాక్ పగులగొట్టి చొరబడ్డారు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న నగదు అపహరించారు. ఈ దృశ్యాలు షాప్‌లో ఉన్న సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఉదయం షాపునకు వచ్చిన వర్కర్లు తాళం పగలగొట్టి ఉండడం చూసి యజమానికి సమాచారమందించారు. ఇదే విషయమై బాధితుడు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.
షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
రణస్థలం: మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ సమీపంలో జాతీయ రహదారిపై హాట్ చిప్స్ నడుపుతున్న వడ్డాది జగదీష్ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో వాషింగ్ మెషిన్ దగ్గర విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయాయి. వెంటనే రణస్థలం అగ్నిమాపక వాహనానికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అర్పివేశారు. సుమారు రూ.1 లక్ష వరకు ఆస్తినష్టం వాటిళ్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
పంచాయతీ కార్యదర్శి ఇంట్లో చోరీ
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని శీపన్నాయుడిపేటలో నివసిస్తున్న పంచాయతీ కార్యదర్శి సుజాత ఇంట్లో 5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. సుజాత ఈనెల 13న రాజమండ్రిలోని ఒక దేవాలయానికి వెళ్లారు. మరుసటి రోజు వచ్చి చూసేసరికి మంచం దిగువన దాచి పెట్టిన బంగారు ఆభరణాల కవర్ లేకపోవడం గమనించింది. బుధవారం ఫిర్యాదివ్వడంతో దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.
టీ షర్ట్‌ల పంపిణీలో వివాదం
జలుమూరు: శ్రీముఖలింగం ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని నదికి తీసుకెళ్లేందుకు దేవదాయ శాఖ అందజేసిన టీ షర్ట్‌ల పంపిణీలో బుధవారం వివాదం చోటుచేసుకుంది. నంది వాహనం వంశధార నదికి తీసుకెళ్లేందుకు ఉత్సాహవంతులైన యువతను గుర్తించి 150 వరకు టీ షర్ట్‌లు అందజేశారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు కాకుండా కూటమి నాయకులు చెప్పినవారికే టీ షర్ట్‌లు అందజేశారని గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఎంపీటీసీ కె.హరి ప్రసాద్ ఆలయ చైర్మన్ శివకుమార్ పాడి, సర్పంచ్ టి.సతీష్‌ను నిలదీశాడు. కనీసం ప్రజాప్రతినిధి అని చూడకుండా ఈవో ఏడుకొండలు ఏకపక్షంగా కూటమి నాయకులు చెప్పిన వారికే అందజేశారని మండిపడ్డారు. సంప్రదాయం ప్రకారం పొందర వీధి గ్రామస్తులు పల్లకీని సిద్ధం చేయాలి. కాళింగ వీధి యువత ఆ పల్లకీని మోయడం అనవాయితీగా వస్తోంది. కానీ ఇవేమీ కాకుండా టీడీపీ నాయకులు చెప్పిన వారికే టీ షర్టులు ఇచ్చి ఆలయ సంప్రదాయాన్ని మంటగలిపారని యువత పెద్ద ఎత్తున ఈవో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అయితే స్వామివారిని నదికి తీసుకెళ్లేందుకు సమయం ఆసన్నమవ్వడంతో ఎంపీటీసీ హరి ప్రసాద్, గ్రామ పెద్దలు ఆ వివాదాన్ని సద్దు మణిగించారు.
ప్రారంభమైన డోలోత్సవ పూజలు
ప్రారంభమైన డోలోత్సవ పూజలు


