రోగులకు నాగులే గతి
పోలాకి: పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవటంతో రోగు లు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఆరోగ్య శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన నాగులు(85) వలంటీర్‌గా అందిస్తున్న సేవలపైనే స్థానికులతో పాటు పలు గ్రామాల నుంచి వచ్చే వారు ఆధారపడుతున్నారు. వాస్తవానికి మండల కేంద్రంలో వున్న పీహెచ్‌సీ పరిధిలో దాదాపు 45 మంది సిబ్బంది పనిచేస్తుండగా అందులో కేవలం ఆస్పత్రిలోనే విధులు నిర్వహించాల్సిన వారి సంఖ్య 17 గా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 24గంటలపాటు(కనీసం స్టాఫ్ నర్స్ అయినా) ప్రజలకు ఆందుబాటులో ఉండాలి. కానీ సాయంత్రం నాలుగైతే చాలు పీహెచ్‌సీలో నాగులు తప్ప రోగుల బాధలు వినేవారు ఎవరూ ఉండరు. ఈ విషయం వైద్యాధికారి శ్రీనాఽథ్ వద్ద ప్రస్తావించగా ఒకస్టాఫ్ నర్స్ అందుబాటులో ఉంటుందని, ఆమె సెలవులో వుండటం వల్ల ఈరోజు ఎవరూ లేరని చెప్పారు. అయితే ఎప్పుడూ ఎవరూ ఉండటం లేదని ఎప్పుడు అడిగి నా సిబ్బంది ఇదే సమాధానం చెబుతున్నారని రోగు లు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మండల కేంద్రంలో 24గంటలపాటు కనీసం స్టాఫ్‌నర్స్ అయినా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


