‘మెరుగైన వసతి కల్పిస్తాం’
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారక తిరుమలరావు గురువారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీకాకుళం రెండో డిపోలను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం రెండో డిపో గ్యారేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు తమ వంతుగా కృషిచేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీ్త్ర శక్తి పథకం విజయవంతంగా కొన సాగుతుందంటే దానికి కారణం ఆర్టీసీ అధికారులు, కండక్టర్‌లు, డ్రైవర్‌ల కృషేనని, వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆదర్శ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలతో సత్కరించారు. శ్రీకాకుళం ఒకటో డిపోకు సంబంధించి కేఎంపీఎల్ సాధించిన డ్రైవర్లు ఎస్‌ఎల్ రావు, ఎస్‌వి రమణ, టార్గెట్ ఎఛీవ్‌మెంట్(ఓఆర్) సాధించిన కండక్టర్‌లు వీఆర్ బాబు, పీవీ రమణ, ప్రతిభ కనబరచిన మెకానిక్ ఎండి సత్తారు, డిప్యూటీ మెకానిక్ ఎస్‌వి రావు, శ్రీకాకుళం రెండో డిపోనకు సంబంధించి కేఎంపీఎల్ సాధించిన డ్రైవర్లు సీహెచ్ తిరుపతిరావు, ఎన్‌కె రావు, టార్గెట్ అచీవ్‌మెంట్(ఓఆర్) సాధించిన కండక్టర్‌లు ఎస్‌ఎస్ రావు, బిఆర్ మూర్తి, ప్రతిభ కనబరచిన అసిస్టెంట్ మెకానిక్ ఈఆర్ మూర్తి, ఓ/ఎస్ మెకానిక్ కె.వేణుగోపాల్ తదితరులకు పురస్కారాలతో సత్కరించారు.


