పక్కాగా రథసప్తమి ఏర్పాట్లు
అరసవల్లి: వచ్చే ఏడాది జనవరి 25న రాష్ట్ర పండుగ గా జరుగనున్న రథసప్తమి మహోత్సవాలకు అరసవల్లిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి సూచించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి ఆలయ పరిసరాల ను పరిశీలించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి పక్కా క్యూలైన్లు, బార్‌కేడింగ్ పనులతో పాటు సీసీ కెమెరాలు వంటి భద్రతాచర్యలు కూడా పూర్తి చేయాలని ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్‌కు సూచించారు. మండపాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మతో కలిసి చర్చించారు. వీఐపీలను ప్రధాన ద్వారం (రాజగోపురం) నుంచి ప్రవేశం లేకుండా బొంపాడవీధి మీదుగా ఉత్తర ద్వారం నుంచి దర్శనాలకు అనుమతిస్తే దాదాపుగా ఇబ్బందులు తప్పుతాయన్నారు. కేవ లం స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించే వీఐపీలు మాత్రమే ప్రధాన ద్వారం ద్వారం నుంచి అనుమతించి.. తదుపరి ప్రవేశాలను నిలిపివేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వివేకానంద, వార్డు ఇన్‌చార్జిలు తెలుగు నాగరత్నం, ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు, గొలివి దాము, రాయిపల్లి అర్జున్, కొయ్యాన రామ్మోహన్, తెలుగు జగదీష్ పాల్గొన్నారు.


