పట్టపగలే చోరీకి యత్నం
పలాస: కాశీబుగ్గలో పట్టపగలు ఒక ప్రయాణికుడి నుంచి ఐదుగురు వ్యక్తులు బలవంతంగా డబ్బులు లాక్కొనే ప్రయత్నం చేయగా స్థానికులు గమనించి వారికి దేహశుద్ధి చేసి కాశీబుగ్గ పోలీసులకు అప్పగించారు. గురువారం కాశీబుగ్గ ఆటో స్టాండ్ వద్ద ఈ సంఘటన జరిగింది. పూండి పలాస ఆర్టీసీ బస్సులో కృష్ణారావు అనే వ్యక్తి ఎక్కాడు. అతని వద్ద డబ్బులు ఉన్నాయని పసిగట్టిన ఐదుగురు వ్యక్తులు అతని సీటు వెనుకాలే కూర్చున్నారు. కాశీబుగ్గ బస్టాండ్ కృష్ణారావు దిగి ఆటో స్టాండ్ పక్కన మూత్ర విసర్జనకు వెళ్తుండగా అతన్ని కొట్టి జేబులో ఉన్న రూ.20వేలు తీసుకున్నారు. కృష్ణారావు కేకలు వేయడంతో ఆటో డ్రైవర్లు, స్థానికులు వచ్చి వెంబడించారు. ఇద్దరు తప్పించుకోగా ముగ్గురిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం కాశీబుగ్గ పోలీసులకు అప్పగించారు. సీఐ పి.సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


