ఖాకీలను ముప్పుతిప్పలు పెడుతున్న
మోస్ట్ వాంటెడ్ దొంగ దున్న కృష్ణ
కాళ్లు విరిగాక కూడా దొంగతనాలకు పాల్పడుతున్న వైనం
పట్టించిన వారికి పారితోషికమంటూ ప్రకటించిన జిల్లా పోలీసులు
శ్రీకాకుళం క్రైమ్ : అతడి ఆయుధాలు రెండే రెండు.. ఒకటి వాహనాల పంచర్‌కు ఉపయోగించే లీవర్, రెండు ఐరన్ రాడ్డు. ఈ రెంటింటితోనే వందలాది ఇళ్లను దోచుకున్నాడు. తెలిసిన భాషలు బోలెడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, బెంగాళీ, ఒడియా, తమిళ్ వంటివన్నీ తెలుసు. కుటుంబమంతా ఎక్కడో కోల్‌కతాలో ఉంటుంది. ఏ మాత్రం ఖాకీల అలికిడి కనిపించినా అతడికి తెలిసిపోతుంది. మకాం మార్చేస్తాడు. అతడిపై 200 కేసులు ఉన్నాయి. మన జిల్లాలోనే వంద వరకు ఉన్నాయి. అతనే జిల్లాలోని మెళియాపుట్టి మండలం చాపరకు చెందిన దున్న కృష్ణ అలియాస్ రాజు అలియాస్ ప్రీతమ్ కిషన్ సింగ్. గత ఆరు నెలలుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఆఖరుకు కృష్ణను పట్టుకుంటే తగిన పారితోషికం అంటూ ప్రజల్లోకి తాజాగా పోస్టర్ విడుదల చేశారు.
సాధారణంగా దొంగలంతా ద్విచక్రవాహనాలు, కార్లు, ప్రైవేటు వాహనాలే ఉపయోగిస్తారు. ఇతగాడు మాత్రం బస్సులు, ఆటోలు, ట్రైన్‌లలో సాధారణ మనిషిలాగానే వస్తాడు. మాస్కులు పెట్టుకోడు. ముసుగు ధరించడు. దర్జాగా ఒకే ఏరియాలో వరుసగా ఐదారు ఇళ్లు ఎంచుకుని దోచేస్తాడు. అది కూడా పోలీసులు వేరే ప్రాంతాలకు బందోబస్తులకు వెళ్లేటప్పుడే. కృష్ణ మీద విజయవాడ, నెల్లూరు, అనకాపల్లి, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి వంటి అనేక ప్రాంతాల్లో కేసులున్నాయి. విజయవాడలో ఓ హెడ్‌కానిస్టేబుల్ కృష్ణను పట్టుకున్నందుకు ఇండియన్ పోలీస్ మెడల్ అతడిని వరించింది.
కాళ్లు విరిగి నడవలేడులే అనుకుంటే..
శ్రీకాకుళం రూరల్ పరిధి విశాఖ–బి కాలనీలో చోరీ కేసులో కృష్ణ దొరికాడు. అదే కేసులో 2024 జనవరిలో బెయిల్ పొందిన కృష్ణ అంపోలు జైలు నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే అనకాపల్లి పోలీసులు అక్కడి చోరీ కేసు విషయమై అరెస్టు చేసేందుకు కాచుకుని ఉండటం గమనించిన కృష్ణ ఎదురుగా ఉన్న పెద్దగోడను దూకి కాళ్లు విరగ్గొట్టుకున్నాడు. పోలీసులు కూడా కాళ్లు విరిగాయి కదా చోరీలు చేయడులే అని అంతా భావించారు. మళ్లీ 2024 సెప్టెంబరు–అక్టోబరు పీరియడ్‌లో వరస నేరాలు మొదలుపెట్టాడు. జిల్లాకేంద్రంలోని పీఎన్‌కాలనీ పదోలైన్‌లో రిటైర్డ్ డీఎస్పీ భార్గవనాయుడుకు సంబంధించిన బంధువుల గెస్ట్‌హౌస్‌లో రూ. 6 లక్షలు కాజేశాడు. అదే కాలనీలో ఓ ఉపాధ్యాయ దంపతుల ఇంటిలో 13 తులాల వరకు చోరీ చేశాడు. అక్కడి నుంచి సుమారు 10 చోరీల్లో దాదాపు 80 తులాల నుంచి వంద తులాల బంగారం వరకు దోచేసినట్లు పోలీసువర్గాలు అంటున్నాయి. చివరిసారిగా ఈ నెల 16 రాత్రి కోర్టు పక్కనే ఓ నివాస గృహంలో 10 తులాల బంగారాన్ని చోరీ చేసినట్లు పోలీసుల సమాచారం. విశాఖలో ఫ్లైట్‌కు వెళ్లే సమయంలో ఎయిర్‌పోర్ట్ సీసీ ఫుటేజీలో చిక్కాడు.


