బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ఆందోళన
బూర్జ: లక్కుపురం కూడలిలో ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేయడం లేదంటూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. పాలకొండ– శ్రీకాకుళం రెండు వైపులా వెళ్లే బస్సులు ఆపి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బస్సులు ఆపకపోవడంతో శ్రీకాకుళం, ఆమదాలవలస, పాలకొండ వంటి సుదూర ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సకాలంలో చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్కుపురం కూడలికి సుమారు 10 గ్రామాల వారు వస్తారని, బస్సులు ఆపక అవస్థలు పడుతున్నామని వాపోయారు. విషయం తెలుసుకున్న బూర్జ ఎంపీపీ కర్నేన దీప విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎస్సై ఎం.ప్రవళ్లిక సిబ్బందితో చేరుకుని సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
రిమ్స్ ప్రిన్సిపాల్‌కే సూపరింటెండెంట్ బాధ్యతలు
● అమలు కాని మంత్రి అచ్చెన్న ఆదేశాలు
శ్రీకాకుళం : శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎస్.అప్పలనాయుడుకే సర్వజన ఆస్పపత్రి సూపరింటెండెంట్ బాధ్యతలను అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి అదనపు బాధ్యతలను కూడా అప్పగిస్తూ సూపరింటెండెంట్‌గా నియమించింది. వాస్తవానికి కళాశాలను, ఆస్పత్రిని ఒకే వ్యక్తి పర్యవేక్షించడం కాస్త కష్టమైన పని. ఈ కారణంగానే వేరు వేరు పోస్టులు ఉన్నప్పటికీ ఒకరికే రెండు బాధ్యతలను అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు ఈ విషయంలో కూడా అమలు కాలేదు. ఇటీవల రిమ్స్‌ను తనిఖీ చేసిన మంత్రి.. ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ లుకలాపు ప్రసన్న కుమార్‌ను సూపరింటెండెంట్ పోస్ట్‌కు సిఫార్సు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆ పోస్టు చేపట్టేందుకు ప్రసన్న కుమార్ సుముఖత వ్యక్తం చేయకపోయినప్పటికీ మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఒప్పించారు. ఏ కారణంగానో ఈ ఆదేశాలు అమలు కాలేదు. రిమ్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేయాలని చేసిన ఆదేశాల సైతం అమలు కాకపోవడం గమనార్హం.
అయ్యప్ప భక్తులకు కేరళలో అన్నదానం
సోంపేట: అయ్యప్పస్వామి మాలధారణ చేస్తున్న తెలుగు భక్తులకు కేరళలో అన్నదానం, ఇతర సౌకర్యాలు కల్పించడమే అఖిలభారత అయ్యప్ప చిన్ముద్రా సేవా ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు రుద్ర కోటేశ్వరరావు తెలిపారు. సోంపేట మండలం లక్కవరంలో అఖిలభారత అయ్యప్ప చిన్ముద్ర ట్రస్ట్, హరిహరపుత్ర చిన్ముద్రా సేవా ట్రస్ట్ లక్కవరం ఆధ్వర్యంలో అయ్యప్పస్వాముల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు అయ్యప్ప భక్తుల కోసం కేరళలో ఈ నెల 16 నుంచి ఉచిత అన్నదానం, అంబులెన్స్ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. హరిహరపుత్ర ట్రస్ట్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస మండలాల పరిధిలోని అయ్యప్ప స్వాములు అన్నదానం కోసం 200 బస్తాల బియ్యం, రెండు క్వింటాళ్ల కందిపప్పు, క్వింటా పెసరపప్పు, క్వింటా చింతపండు, నగదు అందజేశారని వివరించారు. సమావేశంలో సుమారు 1200 మంది అయ్యప్పస్వామి భక్తులు పాల్గొన్నారు.
బీచ్‌లో నిబంధనలు పాటించాలి
గార : కార్తీక మాస వన భోజనాలు (పిక్నిక్)లో భాగంగా సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే సందర్శకులు విధిగా నిబంధనలు పాటించాలని, భద్రతా సిబ్బందికి సహకరించాలని కళింగపట్నం మైరెన్ స్టేషన్ సీఐ బి.ప్రసాదరావు అన్నారు. సోమవారం మొగదాలపాడు, శ్రీకూర్మం–మత్స్యలేశం, బలరాంపురం, పెద్ద గణగళ్లవానిపేట బీచ్‌ల్లో పర్యాటకులకు మైరెన్ విశాఖపట్నం రేంజ్ ఇన్‌చార్జి డీఐజీ గోపినాథ్ జెట్టి ఆదేశాల మేరకు అవగాహన కల్పించారు. మైపాడు బీచ్‌లో ఆదివారం స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతిచెందారని, అలాంటి ప్రమాదాలు జరగకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం తాగి సముద్రంలో స్నానాలు చేస్తే మూడురెట్లు నష్టం పెరుగుతుందన్నారు. జీవితం విలువలను తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత కేరింతలు పేరిట సమద్రపు నీటిలో దిగి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని హితవుపలికారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రపు నీటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, తీర ప్రాంత భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరారు.
బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ఆందోళన
బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ఆందోళన


