స్టేట్‌మీట్ క్రికెట్ పోటీలు ప్రారంభం
తొలి రోజు ఫలితాలు..
● రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 పోటీలకు తరలివచ్చిన క్రీడాకారులు
● పునర్విభజనకు పూర్వపు 13 జిల్లాల నుంచి జట్లు రాక
● బోణీ కొట్టిన ఆతిథ్య శ్రీకాకుళం
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా స్కూల్‌గేమ్స్ రాష్ట్రస్థాయి అండర్–19 బాలుర క్రికెట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ/ఇంటర్మీడియెట్ విద్య పరిధిలోని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా మొదటి మూడు రోజులు బాలురుకు, తర్వాత మూడు రోజులు బాలికలకు పోటీలు నిర్వహిస్తున్నారు. పునర్విభజనకు పూర్వపు 13 జిల్లాల నుంచి బాలురు జట్లు సిక్కోలు చేరుకున్నాయి. శ్రీకాకుళంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో కోడిరామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కళాశాల మైదానాలు చిత్తడిగా మారడంతో ప్రత్యామ్నాయంగా చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల మైదానం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మైదానాల్లో తొలిరోజు పోటీలు నిర్వహించారు. మొదటిరోజు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. శ్రీకాకుళం బాలురు జట్టు తన మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి బోణీ చేసింది.
పోటీలను ప్రారంభించిన గొండు, గాదె..
కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఆతిథ్యంలో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషదాయకమన్నారు. అనంతరం మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు.త తన్మయ నృత్య అకాడమీ బృందం ప్రదర్శించిన నృత్యప్రదకర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టోర్నీ పరిశీలకులు రాజేష్ గోల (కర్నూలు), ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ రేగ సురేష్‌కుమార్, స్థానిక జీజేసీ బాలురు కళాశాల ప్రిన్సిపాల్ జి.వెంకటేశ్వరరావు, డీఈఓ ఎ.రవిబాబు, ఉపవిద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి బి.వి.రమణ, మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.తవిటయ్య, ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకరటమణ, ఒలింపిక్ అసోసియేషన్ సలహాదారు పి.సుందరరావు, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, కె.మాధవరావు, గ్రిగ్స్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఎం.ఆనంద్‌కిరణ్, మెట్ట తిరుపతిరావు, పాతిన రమేష్‌కుమార్, ఢిల్లేశ్వరరావు, రాజశేఖర్, రాజగోపాల్, పీడీలు, రిఫరీలు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
శివాని ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో విశాఖపట్నం–పశ్చిమగోదావరి జిల్లాలు తలపడ్డాయి. విశాఖపట్నం 123 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో మొదటి మ్యాచ్ ప్రకాశం – చిత్తూరు జిల్లాల మధ్య జరగగా.. ప్రకాశం జట్టు గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీకాకుళం– వైఎస్సార్ కడప జిల్లాలు తలపడ్డాయి. శ్రీకాకుళం 83 పరుగులు చేయగా, కడప 32 పరుగులకే కుప్పలికూలింది. దీంతో సిక్కోలు బోణీ కొట్టినట్లయ్యింది.
బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో గుంటూరు–కర్నూలు జిల్లా జట్లు తలపడగా, గుంటూరు 19 పరుగులతో విజయం సాధించింది.
స్టేట్‌మీట్ క్రికెట్ పోటీలు ప్రారంభం


