తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి
● పీజీఆర్‌ఎస్‌లో వైఎస్సార్ సీపీ నాయకుల వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవల వచ్చిన మోంథా తుఫాన్ వర్షాల వల్ల జిల్లా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. శ్రీకాకుళం, గార మండలాలు తీర ప్రాంతంలో ఉన్నందున వరి, అరటి వంటి పంటలు నేలమట్టమయ్యాయని, తక్షణమే బాధిత రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ యువ నాయకుడు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, శ్రీకాకుళం రూరల్ మండల పరిషత్ అధ్యక్షులు అంబటి నిర్మల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ రుప్ప దివ్య శ్రీధర్, గార మండల పరిషత్ అధ్యక్షులు గొండు రఘురాం, జెడ్పీటీసీ మార్పు సుజాత తదితరులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఖరీఫ్ పంట చేతికి అందిన సమయంలో మోంథా తుఫాన్ వచ్చి వరి, అరటి వంటి పంటలను పూర్తిగా నాశనం చేసిందన్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎకరాకు 6 నుంచి 10 క్వింటాళ్ల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేదని, వాస్తవిక నష్టాలను అంచనా వేయలేదని చెప్పారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రాజకీయాలకు అతీతంగా నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో మార్పు పృథ్వీరాజ్, రౌతు శంకరరావు, పీసీ గోపి, శ్రీహరి, ముంజేటి కృష్ణ, రుప్ప అప్పలసూరి, నరేంద్ర, సుగునా రెడ్డి, యు.కృష్ణారావు, శీర సత్యనారాయణ, సర్పంచ్‌లు, ఎం.పి.టి.సిలు, రైతులు పాల్గొన్నారు.


