ఆకాశవీధిలో అద్భుత అవకాశాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: విమానయాన రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధికి కల్పించేందుకు గాను ప్రత్యేక శిక్షణ అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్)కళాశాల ప్రాంగణంలో ఏవియేషన్ స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు చకచకా సాగుతున్నాయి.
నైపుణ్యాలను మెరుగుపర్చేలా..
జిల్లా వాసులు ఏపనైనా ఇష్టంతో కష్టపడిపనిచేసే నైపుణ్యం, నేర్పరితనాన్ని కలిగి ఉన్నారనేది వాస్తవం. ముఖ్యంగా మహిళలు మరింత బాధ్యతాయుతంగా పనులు చేయడంలో దిట్టగా పేరందుకున్నారు. దీంతో జిల్లాలో మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకొని కలెక్టర్ ప్రత్యేక చొరవతో సివిల్ ఏవియేషన్ సహకారంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా నలుమూలల నుంచి చదువుకునే విద్యార్థినులను దృష్టిలో ఉంచుకుని కాలేజీ కేంద్రంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా అభివృద్ధి పనులు జరిపిస్తున్నారు. ఇది కేవలం మహిళలకు మాత్రమే ఉద్దేశించిన ప్రత్యేక శిక్షణ కేంద్రం.
ఏడాదికి 240 మందికి శిక్షణ..
ఇక్కడ రెండు నెలల పాటు ఎయిర్‌లైన్స్ టికెటింగ్ అండ్ రిజర్వేషన్, ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ ఆపరేషన్స్(ప్యాసింజర్ అండ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్) వంటి కీలక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కొక్క బ్యాచ్‌కు 30 మంది చొప్పున, ఒకే విడతలో 60 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విధంగా సంవత్సర కాలంలో 240 మందికి నైపుణ్య శిక్షణ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కేంద్రానికి అవసరమైన సాంకేతికపరమైన పరికరాలు, ప్రయోగశాల సామగ్రిని సీఎస్‌ఆర్ నిధుల నుంచి సంబంధిత సంస్థ వారే సమకూర్చనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
పనులు పరిశీలించిన కలెక్టర్..
కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేస్తున్న ఏవియేషన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా మహిళలు విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలు పొందేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
సిక్కోలులో ఏవియేషన్ స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కేంద్రం
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు
ఏటా 240 మంది మహిళలకు శిక్షణ అందించేలా చర్యలు
పనులు పరిశీలించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్


